ముంబై: ముంబైని కలల నగరం అని పిలుస్తారు. కానీ ఇదే నగరంలో అప్పుడప్పుడు మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా నటి ప్రియా బక్షికి ఎదురైన ఒక భయంకరమైన ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
అసలేం జరిగింది? బాలీవుడ్ సినిమా ‘JNU’ ద్వారా పరిచయమైన నటి ప్రియా బక్షి, ఇటీవల అర్థరాత్రి బాంద్రా నుండి తన ఇంటికి వెళ్లేందుకు ఆటో తీసుకున్నారు. ఆ సమయంలో ఆటో డ్రైవర్ గూగుల్ మ్యాప్స్‌లో చూపించని ఒక తెలియని దారిలోకి వాహనాన్ని తీసుకెళ్లడం ప్రారంభించాడు. “మ్యాప్‌లో రూట్ చూపించడం లేదు, ఇదే సరైన దారి” అని డ్రైవర్ వాదించడం వీడియోలో వినిపిస్తుంది.
పరిస్థితి విషమించడంతో ప్రియా ఆందోళనకు గురై.. “ఆటో ఆపండి భయ్యా, నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్లీజ్ ఆటో ఆపండి, నేను మీతో రాను” అని పదే పదే వేడుకున్నారు.
డ్రైవర్ దురుసు ప్రవర్తన: చివరికి ఆటో ఆపిన డ్రైవర్, ప్రియాతో దురుసుగా ప్రవర్తించాడు. “మీకు దారి తెలియదు కానీ వచ్చేస్తారు. ఇది మా ఏరియా, ఇక్కడికి రాకండి” అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆటో దిగిన తర్వాత ప్రియా తన ఆవేదనను వీడియో ద్వారా పంచుకున్నారు. “మేము ఉత్తర భారతీయులం (North Indians) కావడంతో మమ్మల్ని చెత్తలా చూస్తున్నారు. ఇది ఇక చాలు, నేను దీన్ని సహించలేను” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నటి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో.. “గౌరవం అనేది ప్రాంతాన్ని బట్టి ఉండకూడదు, మానవత్వానికి సరిహద్దులు లేవు. ఎవరైనా తెలియని దారి గురించి ప్రశ్నిస్తే అది అవమానం కాదు” అని రాసుకొచ్చారు.
