ఆడుకుంటుండగా బయటపడ్డ రహస్యం..! 10 ఏళ్ల బాలుడి పనికి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు.. ప్రపంచాన్ని ఆకర్షించిన అరుదైన ఆవిష్కరణ!

ఆస్ట్రేలియాలోని టాస్మానియా సమీపంలో ఉన్న డీల్ ద్వీపంలో (Deal Island) తన తల్లిదండ్రులతో కలిసి ఉన్న 10 ఏళ్ల బాలుడు మర్ఫీ విటోవ్సన్ (Murphy Whittowson), తన అద్భుతమైన పరిశీలనా శక్తితో సైన్స్ ప్రపంచంలో సరికొత్త రికార్డు సృష్టించాడు.

గతంలో (2020లో) ఆడుకుంటున్న సమయంలో కంటపడిన ఒక విచిత్రమైన సాలీడును చూసి ఏమాత్రం భయపడకుండా.. అది ఏ రకానికి చెందినదో తెలుసుకోవాలనే ఉత్సుకతతో మ్యూజియం పరిశోధకులకు అప్పగించాడు. బాలుడి ఈ ప్రయత్నాన్ని అనుసరించి ప్రముఖ సాలీడు పరిశోధకులు అత్యాధునిక సాంకేతికతతో ఆ జీవిని క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు, అది ప్రపంచంలో ఇంతవరకు ఎవరికీ తెలియని సరికొత్త జాతికి చెందిన ‘వోల్ఫ్ స్పైడర్’ (తోడేలు సాలీడు – Wolf Spider) అని శాస్త్రవేత్తలు అధికారికంగా నిర్ధారించారు.

ఈ అరుదైన ఆవిష్కరణకు కారణమైన ఆ చిన్నారి ఆసక్తిని గౌరవిస్తూ, శాస్త్రవేత్తలు ఆ కొత్త జాతి సాలీడుకు అతని పేరిట ‘ఆర్టోరియోప్సిస్ మర్ఫీ’ (Artoriopsis murphyi) అని నామకరణం చేశారు. కేవలం 5 మిల్లీమీటర్ల పరిమాణం మాత్రమే ఉండే ఈ సాలీడు విషపూరితం కానిది, మనుషులకు ఎలాంటి హానీ కలిగించని ఒక సాధు జీవి. కేవలం పెద్ద పెద్ద ప్రయోగశాలల్లోనే శాస్త్రీయ ఆవిష్కరణలు సాధ్యమవుతాయనే అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ.. ఒక సాధారణ బాలుడి జిజ్ఞాస ప్రపంచానికి ఒక కొత్త జీవిని పరిచయం చేయడం పట్ల ప్రకృతి ప్రేమికులు, శాస్త్రవేత్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Posted

in

by

Tags: