హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో ఆడుకుంటున్న చిన్నారుల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది.
సెక్టార్ 56 పరిధిలో కన్ను (13) అనే బాలుడిని 15 ఏళ్ల బాలుడు కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఇంటి బయట పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన కన్నును కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఆడుకునే సమయంలో నెట్టుకోవడంతో ఇద్దరు బాలుర మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వాగ్వాదం కాస్తా క్షణాల్లో తీవ్ర ఘర్షణగా మారింది. ఆ సమయంలో 15 ఏళ్ల బాలుడు కన్ను ఛాతీపై కత్తితో బలంగా పొడిచాడని పోలీసులు తెలిపారు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత, కలకలం రేగింది.
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడైన బాలుడితో పాటు అతని తల్లిదండ్రులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, ఆ బాలుడి చేతికి కత్తి ఎలా వచ్చింది, అసలు గొడవ ఎందుకు ముదిరింది, దాడి జరిగిన పరిస్థితులేమిటి అనే కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను కూడా విచారిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు, వారి స్నేహితులు ఎవరు, ఆటలాడే సమయంలో వారి ప్రవర్తన ఎలా ఉంటోంది అనే విషయాలను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించారు. మామూలుగా మొదలైన చిన్నపాటి గొడవ చివరకు 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీయడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply