ఆధారాలే దొరకవు.. మనుషులను ఆవిరి చేసే ఆయుధాలు.. గాజాలో ఇజ్రాయెల్ వదిలిన “ఘోర రాక్షసుడు”!

టెల్ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోందని అందరికీ తెలిసిందే. అయితే, ఈ దాడుల్లో మనుషులను క్షణాల్లో ఆవిరి చేసే అత్యంత భయంకరమైన ఆయుధాలను ఇజ్రాయెల్ ఉపయోగిస్తోందని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ రకమైన ఆయుధాల వల్ల ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడనే ఆనవాళ్లు కూడా లేకుండా పోతున్నాయని సమాచారం.

ఆవిరైపోతున్న ప్రజలు: దాడుల తర్వాత ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రజలు క్షణాల్లో మాయమైపోతున్నారని అల్ జజీరా ఒక నివేదికను విడుదల చేసింది. అక్టోబర్ 2023 నుండి సుమారు 2,842 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు ఆ రిపోర్ట్ పేర్కొంది. గాజా సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మహమూద్ బజల్ మాట్లాడుతూ.. “మేము ప్రతి ఇంటికి వెళ్లి విచారిస్తున్నాము. ఒక కుటుంబంలో ఐదుగురు ఉండి, దాడి తర్వాత కేవలం ముగ్గురి మృతదేహాలే దొరికితే.. మిగిలిన ఇద్దరు మాయమైనట్లు భావిస్తాము. గోడలపై రక్తపు చుక్కలు లేదా చిన్న చిన్న శరీర భాగాలు తప్ప మరేమీ దొరకకపోతే, వారు ఆవిరైపోయారని నిర్ధారిస్తాము” అని తెలిపారు.

థర్మోబారిక్ బాంబులు (Thermobaric Bombs): వీటి కోసం ఇజ్రాయెల్ ‘థర్మోబారిక్ బాంబులను’ ఉపయోగిస్తోందని సమాచారం. ఈ బాంబులు పేలినప్పుడు అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రత మరియు విపరీతమైన ఒత్తిడి (Pressure) ఉత్పన్నమవుతాయి. ఇవి కేవలం చంపడమే కాదు, శరీరం ఉన్న సాక్ష్యాలను కూడా నాశనం చేస్తాయి. ఈ బాంబులు రెండు దశల్లో పనిచేస్తాయి. మొదటి దశలో గాలిలోకి ఇంధనాన్ని వెదజల్లుతాయి. రెండో దశలో పేలుడు సంభవిస్తుంది. అప్పటికే గాలిలో ఉన్న ఆక్సిజన్‌ను ఇది పీల్చుకుని సుమారు 3,500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను సృష్టిస్తుంది. ఈ వేడికి సమీపంలో ఉన్నవారు కాలి బూడిదై ఆవిరైపోతారు.

ఆధారాలు మాయం: పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మునీర్ అల్-బర్ష్ మాట్లాడుతూ.. “నీరు 100 డిగ్రీల వద్ద మరుగుతుంది. కానీ శరీరం 3,000 డిగ్రీల కంటే ఎక్కువ వేడిని, భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు శరీరంలోని ద్రవాలు తక్షణమే మరుగుతాయి. కణజాలాలు ఆవిరైపోయి బూడిదగా మారుతాయి” అని వివరించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పౌరులపై ఇలాంటి ఆయుధాలను ఉపయోగించడం నిషేధం.


Posted

in

by

Tags: