ప్రముఖ ఆర్థిక నిపుణుడు ఆనంద్ శ్రీనివాసన్ తన తాజా వీడియోలో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయో వివరిస్తూనే, వెండి ధరల విషయంలో అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం వెండి ధరలు భారీగా పడిపోతున్నాయని, ఇది ఇంకా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వెండిని పెట్టుబడిగా చూడకుండా కేవలం ఫ్యాషన్ లేదా అలంకరణ వస్తువుగా మాత్రమే చూడాలని ఆయన తేల్చి చెప్పారు.
ఇది వెండిపై పెట్టుబడి పెట్టిన వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో, ప్రత్యామ్నాయంగా వెండిపై డబ్బు కుమ్మరించిన వారు ఇప్పుడు షాక్లో ఉన్నారు.
వెండి ధర ఎంత పడిపోయింది? ఆనంద్ శ్రీనివాసన్ విశ్లేషణ ప్రకారం, వెండి ధర ఇప్పటికే 10 శాతం మేర పడిపోయింది. డాలర్ పరంగా చూస్తే ఇది 70 డాలర్ల కంటే దిగువకు చేరుకుంది. భారతదేశ రిటైల్ మార్కెట్లో వెండి ధర ప్రస్తుతం కిలో రూ. 2.2 లక్షల నుండి రూ. 2.4 లక్షల మధ్య ఉంది. గతంలో రూ. 4 లక్షల వరకు వెళ్ళిన ధర ఇప్పుడు దాదాపు 50 శాతం పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ పతనం ఇక్కడితో ఆగదని, ఇంకా తగ్గుతుందని ఆయన ఖచ్చితంగా చెబుతున్నారు.
వెండి జోలికి వెళ్లకండి: వెండి ధరలు దారుణంగా పడిపోతున్నాయని, ఇప్పుడు కొనడం చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరిస్తున్నారు. “వెండిని ముట్టుకోకండి” అని తాను ఎప్పటి నుండో చెబుతున్నానని, వెండి పెట్టుబడికి ఏమాత్రం సురక్షితం కాదని ఆయన పునరుద్ఘాటించారు.
టైటాన్ సంస్థ వెండి విక్రయాలు: ప్రముఖ జ్యువెలరీ సంస్థ ‘టైటాన్’ వెండి ఆభరణాలను ఎక్కువగా విక్రయించడాన్ని ఆయన ప్రస్తావించారు. బంగారం విక్రయాలు తగ్గడంతోనే ఆ సంస్థ వెండిని ఫ్యాషన్ వస్తువుగా మార్చి విక్రయిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. “డబ్బు లేకపోతే వెండి ఆభరణాలు కొనుక్కోండి, కానీ పెట్టుబడి కోసం మాత్రం వద్దు” అని ఆయన స్పష్టం చేశారు.
వెండి ఎప్పటికీ బంగారానికి సాటి రాదు: వెండి ఎన్నటికీ బంగారానికి ప్రత్యామ్నాయం కాలేదని ఆనంద్ శ్రీనివాసన్ గట్టిగా చెబుతున్నారు. ఇప్పుడు కాదు కదా, మరో 100 ఏళ్ల తర్వాత కూడా ఇది జరగదని ఆయన నొక్కి చెప్పారు. బ్యాంకుల్లో వెండిని కుదువ పెట్టినప్పుడు దాని విలువలో 80 శాతం రుణం ఇచ్చే రోజు వచ్చినప్పుడే, వెండిని అసలైన పెట్టుబడిగా గుర్తించాలని, అప్పటి వరకు అది కేవలం ఒక ‘ఫ్యాషన్ మెటల్’ మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు.
