అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు జియోమార్ట్ సంస్థలకు కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA) భారీ జరిమానా విధించింది.
ప్రభుత్వం వద్ద అధికారికంగా నమోదు (రిజిస్టర్) చేయని ‘సైక్లోసినోన్ హెర్బిసైడ్’ (Cyclosinone Herbicide) అనే వ్యవసాయ రసాయన కలుపు మందును తమ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించినందుకు, ప్రచారం చేసినందుకు గాను ఈ చర్యలు తీసుకున్నారు.
దీని ప్రకారం, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించగా, జియోమార్ట్‌కు రూ.5 లక్షల జరిమానా విధించారు. ఈ చర్యలకు సంబంధించిన ఉత్తర్వులు సెప్టెంబర్ 22వ తేదీన జారీ చేసినట్లు సమాచారం.
ఈ కలుపు మందులో ఉపయోగించిన ప్రధాన రసాయన మూలకం పేరు లేదా దాని మిశ్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకుండానే మార్కెట్లో విక్రయించినట్లు వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ తెలిపింది. దీంతో, ఆ ఉత్పత్తి విక్రయాలను మరియు ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఈ 3 సంస్థలను ఆదేశించింది.
అంతేకాకుండా, చట్టాన్ని ఉల్లంఘించే లేదా వినియోగదారుల భద్రతకు ముప్పు కలిగించే ఉత్పత్తులు తమ ఆన్లైన్ వేదికలపై జాబితా కాకుండా నిరోధించేందుకు స్వీయ తనిఖీలు (సెల్ఫ్ ఆడిట్) నిర్వహించాలని ఆయా సంస్థలను ఆదేశించింది. ఉత్తర్వులు జారీ అయిన 15 రోజుల్లోగా దీనికి సంబంధించిన నివేదికలను సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.

Leave a Reply