ఆపరేషన్ హార్ముజ్, ఖార్గ్ ద్వీపం: పదాతి దళ దాడుల కోసం ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా బలగాల మోహరింపు

ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఈరాన్‌పై నిరంతర దాడులు చేస్తున్నాయి. ఈ దాడులకు ఈరాన్ కూడా దీటుగా సమాధానం ఇస్తోంది. ఈ యుద్ధం కారణంగా ఈరాన్ తన సరిహద్దుల్లోని వ్యూహాత్మక ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) ని మూసివేసింది. ఈ జలసంధిని వెంటనే తెరవకపోతే ఈరాన్‌లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు.

దీని కోసం ట్రంప్ గడువు విధిస్తూనే, మరోవైపు ఈరాన్ లొంగకపోతే పదాతి దళాలతో (Ground Attack) దాడులు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఈరాన్ సమీపంలో అమెరికా తన సైన్యాన్ని భారీగా మోహరిస్తోంది. ఈ దాడులను ఎదుర్కోవడానికి తాము సిద్ధమని ఈరాన్ కూడా ప్రకటించింది. గల్ఫ్ దేశాల భూభాగం నుండి ఈరాన్‌లోకి ప్రవేశించడం కంటే, సముద్ర మార్గం ద్వారా దాడులు చేయడం సరైనదని అమెరికా భావిస్తోంది.

సైనిక మోహరింపు: దీని కోసం ‘యు.ఎస్.ఎస్. త్రిపోలి’ (USS Tripoli) అనే యుద్ధనౌక ద్వారా 3,500 మంది అమెరికన్ మెరైన్ సైనికులు గల్ఫ్ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం మొత్తం 5,000 మంది సైనికులు ఈరాన్‌పై దాడికి సిద్ధంగా ఉండగా, మరో 10,000 మందిని మధ్యప్రాచ్యానికి పంపాలని పెంటగాన్ యోచిస్తోంది. ఈ దాడులు ప్రారంభమైతే కొన్ని వారాల నుండి గరిష్టంగా రెండు నెలల వరకు కొనసాగవచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నారు.

మోదీ-ట్రంప్ చర్చలు: ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ మరియు ట్రంప్ ఫోన్లో చర్చించుకున్నారు. ఈ సంభాషణలో ఎలాన్ మస్క్ కూడా పాల్గొనడం ఒక ఆసక్తికరమైన మలుపు.

ఈరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ హెచ్చరిస్తూ.. “మా మౌలిక సదుపాయాలు లేదా ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే మా ప్రతిదాడి తీవ్రంగా ఉంటుంది. మేము ముందుగా ఎవరినీ అటాక్ చేయము” అని ఎక్స్‌ (X) వేదికగా స్పష్టం చేశారు.

అమెరికా వ్యూహం ప్రకారం.. ఈరాన్ చమురు నిల్వలు ఎక్కువగా ఉండే ‘ఖార్గ్ ద్వీపాన్ని’ (Kharg Island) ముందుగా స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత చర్చలకు పిలవాలని చూస్తోంది. ఈరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యమని, దేశాన్ని ఆక్రమించడం తమ ఉద్దేశ్యం కాదని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. క్షిపణి కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు మరియు అబు మూసా వంటి ద్వీపాలను స్వాధీనం చేసుకోవడం ఈ ఆపరేషన్ లో ప్రధానాంశాలు.


Posted

in

by

Tags: