పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. తాజాగా పాకిస్తాన్ వాయుసేన విమానాలు ఆఫ్ఘనిస్తాన్లోని పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా పలువురు పౌరులు మరణించారు. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన 17 మంది బలికావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
దాడులకు కారణం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మరియు పాకిస్తాన్ సైన్యానికి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో జరుగుతున్న ఆత్మహుతి దాడులకు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్’ (TTP) కారణమని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఇటీవల పాకిస్తాన్‌లోని బాజౌర్, భాను ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 30 మందికి పైగా మరణించారు. దీనికి ప్రతీకారంగానే పాకిస్తాన్ ఈ వైమానిక దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఆఫ్ఘన్ ప్రభుత్వ స్పందన: నంగర్హార్ మరియు పక్తికా ప్రావిన్స్‌లలో పాకిస్తాన్ జరిపిన దాడులను తాలిబాన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ధృవీకరించారు. “పాకిస్తాన్ తన భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అమాయక పౌరులపై దాడులు చేస్తోంది. డజన్ల కొద్దీ మహిళలు, పిల్లలు చనిపోయారు” అని ఆయన మండిపడ్డారు.
పాకిస్తాన్ వాదన: పాకిస్తాన్ మంత్రి అటావుల్లా తారార్ స్పందిస్తూ.. ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 7 చోట్ల దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సరిహద్దులను మూసివేశారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉండటంతో సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు.
