ఆమెకు 57.. అతడికి 27.. ‘టీచర్’తో కుర్రాడి కిలాడీ ప్రేమ! చివరికి ఏం జరిగిందంటే? నమ్మిన ప్రియుడే కాలయముడయ్యాడు!

కర్ణాటక: ప్రేమకు వయస్సుతో సంబంధం లేదంటారు.. కానీ ఆ ప్రేమే ధనాశకు బలైతే, అక్కడ మిగిలేది రక్తసిక్తమైన గాథ మాత్రమే. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు తనకంటే 30 ఏళ్లు చిన్నవాడైన యువకుడిని నమ్మి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఇప్పుడు సర్వత్రా సంచలనం రేపుతోంది. కేవలం డబ్బు కోసం మొదలైన గొడవ, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

రిటైర్మెంట్‌కు ముందే రాలిపోయిన ప్రాణం: సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ప్రభుత్వ టీచర్ జ్యోతి (57). మరో కొన్ని నెలలు గడిస్తే ఆమె పదవీ విరమణ చేసి ప్రశాంతంగా గడపాల్సింది. కానీ ఒకరోజు ఇంట్లో పని ఉందని బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు రోడ్డు పక్కన గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన స్థితిలో ఒక మహిళా శవం లభ్యమైంది. అది జ్యోతిదేనని తేలడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు.

నందిని పార్లర్‌లో చిగురించిన ‘అక్రమ’ బంధం: పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతికి 27 ఏళ్ల అమర్ అనే యువకుడితో పరిచయం ఉంది. అమర్ ఒక నందిని పార్లర్ నడిపేవాడు. అక్కడికి అప్పుడప్పుడు వెళ్లే జ్యోతితో అతడికి స్నేహం కుదిరింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అతడిపై ఉన్న వ్యామోహంతో జ్యోతి.. అమర్‌కు కారు, బంగారు ఆభరణాలు మరియు లక్షలాది రూపాయల నగదును ఇస్తూ వచ్చింది. అమర్ కూడా ఆమె సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు.

డబ్బు గొడవే కొంపముంచింది: గత కొద్దిరోజులుగా జ్యోతి తాను ఇచ్చిన నగదును తిరిగి అడగడం మొదలుపెట్టింది. అప్పటికే ఆ డబ్బునంతా ఖర్చు చేసిన అమర్‌కు జ్యోతి ఒత్తిడి పెద్ద ‘టార్చర్’లా అనిపించింది. ఆ వేధింపుల నుండి తప్పించుకోవాలంటే ఆమెను అడ్డు తొలగించుకోవడమే మార్గమని కిరాతక ప్లాన్ వేశాడు.

గుడికి వెళ్దామని తీసుకెళ్లి.. స్మశానానికి: పథకం ప్రకారం.. ‘గుడికి వెళ్దాం రా’ అని జ్యోతిని నమ్మించి తీసుకెళ్లాడు అమర్. దారిలో ఒక పెట్రోల్ బంక్ వద్ద బాటిల్‌లో పెట్రోల్ కొన్నాడు. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాలు దొరకకుండా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. అయితే, పెట్రోల్ బంక్‌లోని సిసిటివి దృశ్యాలు హంతకుడి పాపాన్ని బట్టబయలు చేశాయి. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నమ్మిన ప్రియుడే కాలయముడైన ఈ ఘటన సమాజానికి ఒక హెచ్చరికగా నిలిచింది.


Posted

in

by

Tags: