ఆరెంజ్ తోటలోకి పరుగులు.. 1.5 కిలోమీటర్ల సుదీర్ఘ ఛేజింగ్! సినిమాను తలపించిన పోలీసుల వేట.. చివరకు సైబర్ నిందితుడు అరెస్ట్

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన రూ.16 లక్షల ఆన్‌లైన్ మోసం కేసులో పోలీసులు వెతుకుతున్న ఆదిత్య అనే వ్యక్తిని మధ్యప్రదేశ్‌లో సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆన్‌లైన్ మోసానికి సంబంధించిన ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదిత్య మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

అయితే పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న ఆదిత్య.. వారి కంటపడకుండా తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. అలా పరిగెడుతూ సమీపంలోని ఆరెంజ్ తోటల్లోకి వెళ్లిపోయాడు.

ఇటీవల అక్కడ భారీగా వర్షాలు కురవడంతో తోటలు, పొలాల్లో మట్టి బురదగా మారింది. దీంతో పరుగులు తీస్తున్న ఆదిత్యతో పాటు అతడిని వెంబడిస్తున్న పోలీసులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ పోలీసులు అతడిని వదిలిపెట్టకుండా వెంబడించారు.

సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఛేజింగ్ కొనసాగినట్లు సమాచారం. హెడ్ కానిస్టేబుల్ హితేంద్ర బాగ్రీ, కానిస్టేబుల్ బాబూలాల్ గుర్జర్ బురదమయమైన దారుల్లోనూ ఆదిత్యను వెంటాడారు.

చివరకు చాలాసేపు కొనసాగిన ఈ పరుగుపందెంలో పోలీసులు ఆదిత్యను పట్టుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి అజ్మీర్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం సైబర్ పోలీసులు అతడిని విచారిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. అరెస్టైన ఆదిత్య బ్యాంక్ ఖాతాలో సుమారు రూ.6.30 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం.

ఆ డబ్బు ఎవరి నుంచి వచ్చింది? ఎవరికి బదిలీ చేశారు? రూ.16 లక్షల ఆన్‌లైన్ మోసంలో ఆదిత్య పాత్ర ఏమిటి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంతేకాకుండా ఈ ఆన్‌లైన్ మోసంతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించే పనిలోనూ సైబర్ పోలీసులు నిమగ్నమయ్యారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *