న్యూఢిల్లీ: ఒక వైరల్ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా భావోద్వేగానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో ‘బ్లింకిట్’ (Blinkit) డెలివరీ పార్ట్నర్ తన డ్యూటీలో ఉన్న సమయంలో గడిపిన కొన్ని క్షణాలు.. లక్షలాది మందికి వారి జీవితాల్లోని అసంపూర్ణ కలలను (నెరవేరని కోరికలను) గుర్తుచేస్తున్నాయి.
క్రికెట్ బ్యాట్‌తో అతను గడిపిన ఆ చిన్న భావోద్వేగ క్షణం ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అసలు విషయమేమిటంటే.. వీడియోలో ఒక బ్లింకిట్ డెలివరీ బాయ్ తన ఆర్డర్ డెలివరీ పూర్తి చేసిన తర్వాత, రోడ్డు పక్కన ఉంచిన ఒక క్రికెట్ బ్యాట్‌ను చూస్తాడు. కొన్ని సెకన్ల పాటు తను చేస్తున్న పనిని, ఆ పరుగుల జీవితాన్ని పక్కన పెట్టి.. ఆ బ్యాట్‌ను చేతుల్లోకి తీసుకుని క్రికెట్ ఆడుతున్నట్లు కొన్ని షాట్లు కొడతాడు. ఆ తర్వాత ఆ బ్యాట్‌ను ఎంతో ప్రేమగా ముద్దాడి, మళ్లీ తన తదుపరి ఆర్డర్ కోసం బైక్ వేసుకుని వెళ్ళిపోతాడు.
ఎలాంటి డైలాగులు లేకుండానే వైరల్ అయిన వీడియో
ఈ వీడియోలో ఎలాంటి డైలాగులు లేవు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేదు, ఎలాంటి డ్రామా లేదు. అయినప్పటికీ ఈ వీడియో ప్రజల హృదయాలను లోతుగా తాకుతోంది. ఇది కేవలం క్రికెట్‌కు సంబంధించిన వీడియో మాత్రమే కాదు.. బాధ్యతల మధ్య ప్రజలు ఎక్కడో వదిలేసిన అసంపూర్ణ కలల కథ అని సోషల్ మీడియా యూజర్లు అభివర్ణిస్తున్నారు.
తమ అసంపూర్ణ కలలతో కనెక్ట్ అవుతున్న ప్రజలు
ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది తమ జీవితాలను దీనితో పోల్చుకుంటున్నారు. జీవితంలో వచ్చే బాధ్యతల వల్ల చాలా మంది తమ అసలైన ఆసక్తులను, కలలను అణచివేసుకుంటారని ఒకరు రాశారు. మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ఒకప్పుడు ఆటగాళ్లుగా, కళాకారులుగా లేదా సింగర్లుగా మారాలని కలలుగని, పరిస్థితుల ప్రభావంతో వేరే మార్గాల్లో ప్రయాణించాల్సి వచ్చిన లక్షలాది మంది భారతీయుల కథను ఈ ఒక్క క్షణం కళ్లకు కడుతోందని కామెంట్ చేశారు.
కొన్ని సెకన్ల పాటు మళ్లీ ప్రాణం పోసుకున్న క్రికెట్ పిచ్చి
ఆ వీడియోలో కనిపిస్తున్న డెలివరీ పార్ట్నర్ ఆ కొన్ని క్షణాల పాటు కేవలం డెలివరీ బాయ్‌లా కాకుండా.. తన పాత కలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్న ఒక క్రికెట్ ప్రేమికుడిలా కనిపిస్తాడు. అతను బ్యాట్‌ను ముద్దాడిన విధానాన్ని చూస్తే.. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మనిషి లోపల దాగి ఉన్న ఆశయం లేదా ఇష్టం ఎప్పటికీ పూర్తిగా చావదని నిరూపిస్తోందని ప్రజలు చెప్పుకుంటున్నారు.
