సోషల్ మీడియాలో వెలుగుచూస్తున్న వివిధ ఆహార పదార్థాల తయారీ వీడియోలు ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతితో పాటు అపరిశుభ్రత, అనారోగ్య భయాలను రేకెత్తిస్తున్నాయి.
ఆ కోవలోనే తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో, మన వంటిళ్లలో నిత్యం వాడే ఆవనూనె (మస్టర్డ్ ఆయిల్) ఎలా తయారవుతోంది, దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో నిల్వ చేస్తున్నారనే భయంకరమైన నిజాన్ని బట్టబయలు చేసింది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో, వంట కోసం ఉపయోగించే ఆవనూనెతో నిండిన ఒక భారీ నిల్వ తొట్టి (స్టోరేజ్ ట్యాంక్) లోపల ఒక యువకుడు దిగి దర్జాగా స్నానం చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ తొట్టిలో దిగిన అతడు కేవలం స్నానం చేయడమే కాకుండా, నూనెలో పూర్తిగా మునిగి లేస్తూ, జుట్టును కడుక్కుంటూ ఒళ్లంతా రుద్దుకుంటున్నాడు. ప్రజలు వంటకు వాడే నూనె ట్యాంకులోనే అతడు ఇలా అసహ్యకరంగా స్నానం చేయడం చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం, అసహ్యం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యాక్టరీలా కనిపిస్తున్న ఆ ప్రదేశంలో నేలపై నూనె కారిపోయి ఉండటం, పక్కనే మరొక వ్యక్తి నిల్చుని ఉండటం కూడా కనిపిస్తోంది. ఇలాంటి తీవ్రమైన అపరిశుభ్ర చర్యలను ఎలా ఉపేక్షిస్తున్నారని, మనం మార్కెట్లో కొనుగోలు చేసే నిత్యావసర ఆహార పదార్థాలు ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో తయారవుతున్నాయోనంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
@KUNDAN00PATEL అనే యూజర్‌తో పాటు పలువురు ఈ వీడియోను నెట్టింట షేర్ చేస్తూ.. మార్కెట్లో ఆవనూనె కొనేముందు దాని నాణ్యత, తయారీ విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో, ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ జోరందుకుంది.

Leave a Reply