ఆసుపత్రి గడప ముందే విలవిల్లాడిన మూడు ప్రాణాలు..! చేర్చుకోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు: కళ్లముందే గర్భిణి, కవల పిల్లల మృతి.. ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు!

కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రాథమిక అవసరమైన వైద్యం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయిందనడానికి ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ విషాద సంఘటనే నిదర్శనం.

సరైన సమయానికి సరైన వైద్యం అందక ఓ నిండు గర్భిణి, ఆమె కడుపులోని కవల పిల్లలు ప్రాణాలు కోల్పోయిన తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లా ఇనోలు గ్రామానికి చెందిన 24 ఏళ్ల నిషా గర్భిణిగా ఉన్న సమయంలో హఠాత్తుగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు; అయితే అక్కడ తగిన వసతులు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ పరీక్షించిన వైద్యులు, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే వేరే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడితో ఆ కుటుంబం యొక్క నరకయాతన మొదలైంది. హల్ద్వానీ, కాశీపూర్ పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ వారు తిరిగారు. కానీ, ఏ ఆసుపత్రిలోనూ ఆమెను చేర్చుకుని సరైన సమయంలో వైద్యం అందించలేదు.

గంటల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరిగిన అనంతరం, చివరకు కాశీపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను చేర్చారు. కానీ అప్పటికే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, దురదృష్టవశాత్తూ నిషా ప్రాణాలు విడిచింది.

అనంతరం వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ఆమె గర్భంలోని కవల పిల్లలను బయటకు తీశారు. వారిలో ఒక శిశువు అప్పటికే మరణించి జన్మించగా, మరో శిశువు కొద్ది గంటల్లోనే కన్నుమూసింది. ఒకే కుటుంబంలో మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

మృతురాలి మామ రాజు డమ్కా కన్నీరుమున్నీరవుతూ, “మా కోడలికి సరైన సమయానికి సరైన వైద్యం అంది ఉంటే ఈరోజు ఈ మూడు ప్రాణాలు మా కళ్లముందే బతికుండేవి” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ ఆరోగ్య వ్యవస్థలో నెలకొన్న అలసత్వం, నిర్లక్ష్యానికి పేద ప్రజలు తమ ప్రాణాలనే మూల్యంగా చెల్లించుకోవాల్సి వస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


Posted

in

by

Tags: