“ఆసుపత్రిలోనే ఇంత అరాచకమా..?” రోగులను పట్టించుకోవాల్సిన వారే వైన్ షాప్‌లా మార్చేశారు.. ప్రాణాలు కాపాడాల్సిన చోట దొంగచాటుగా మందు విందు; వైరల్ వీడియోతో బట్టబయలు!

బీహార్‌లోని దర్భంగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో (DMCH) రోగులకు సేవలందించాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న సిబ్బంది, ఏకంగా డ్యూటీ సమయంలోనే మద్యం సేవించినట్లు చూపుతున్న ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విడుదలై తీవ్ర కలకలం రేపింది.

నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. కొందరు మహిళా సిబ్బంది తమ బ్యాగుల నుంచి తినుబండారాలు, ప్లాస్టిక్ గ్లాసులను బయటకు తీస్తుండగా, ఓ పురుష ఉద్యోగి తన నడుము భాగంలో దాచి ఉంచిన టెట్రా ప్యాక్ (Tetra Pack) మద్యాన్ని తీసి వారికి ఇవ్వడం స్పష్టంగా రికార్డైంది.

ఆసుపత్రిలోని సర్జికల్ ఓపీడీ (OPD) మెట్ల సమీపంలో ఈ తతంగం నడిచినట్లు సమాచారం. ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా పనిచేస్తున్న ట్రాలీమ్యాన్, ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన మహిళా సిబ్బంది ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిసింది.

ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే సంబంధిత ఏజెన్సీ వారిని వెంటనే విధుల నుంచి తొలగించినట్లు తెలిపినప్పటికీ, వారు మళ్లీ విధుల్లోకి చేరినట్లు వార్తలు వస్తుండటంతో ఆసుపత్రి యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు, ఈ ఘటనపై ట్రాలీమ్యాన్ సూపర్‌వైజర్ రమణ్ సింగ్ మాట్లాడుతూ.. వీడియోలో కనిపిస్తున్న వారిని కొన్ని నెలల క్రితమే విధుల నుంచి తొలగించామని పేర్కొన్నారు. అయితే ఉన్నతాధికారుల సమగ్ర దర్యాప్తు తర్వాతే అసలు నిజాలు బయటపడటంతో పాటు బాధ్యులపై చర్యలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *