‘ఇంటల్లుడిగా రా’ అన్న భార్య.. విడాకులు కోరిన భర్తకు హైకోర్టులో ఎదురుదెబ్బ!

వృద్ధులైన తల్లిదండ్రులను వదిలి అత్తింట్లోనే ఉండాలని భార్య ఒత్తిడి చేసిందంటూ భర్త పిటిషన్.. మానసిక వేధింపులుగా పరిగణించలేమన్న జార్ఖండ్ హైకోర్టు!

భార్యాభర్తల మధ్య వివాదాలకు సంబంధించిన కేసుల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

భార్య తన పుట్టింటికి వచ్చి ‘ఇంటల్లుడిగా’ ఉండాలని భర్తను కోరడం లేదా ఒత్తిడి చేయడం మాత్రమే మానసిక వేధింపులు లేదా మానసిక క్రూరత్వం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది.

జార్ఖండ్‌లోని హజారిబాగ్‌కు చెందిన రాహుల్ చౌబేకు, పాట్నాకు చెందిన ఓ మహిళతో 2008 నవంబర్ 21న వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి.

భర్త రాహుల్ చౌబే దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం… తన భార్య తరచూ పుట్టింటికి వెళ్లి చాలా కాలం అక్కడే ఉండేదని ఆయన ఆరోపించారు. 2013 ఫిబ్రవరి 24న పాట్నాకు వెళ్లిన ఆమె… ఆ తర్వాత హజారిబాగ్‌లోని భర్త ఇంటికి తిరిగి రాలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

అంతేకాదు… తన తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో, వారి బాధ్యతలు చూసుకోవాల్సిన అవసరం తనకు ఉందని రాహుల్ తెలిపారు. అయితే తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం హజారిబాగ్‌లోని ఇంటిని వదిలి పాట్నాలోనే ఉండి ‘ఇంటల్లుడిగా’ జీవించాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు.

దీంతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని… ఈ కారణంతో తనకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే 2022లో కుటుంబ న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది.

దీంతో రాహుల్ చౌబే ఆ తీర్పును సవాల్ చేస్తూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును న్యాయమూర్తులు సుజిత్ నారాయణ్ ప్రసాద్, సంజయ్ ప్రసాద్తో కూడిన ధర్మాసనం విచారించింది. కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ… భర్త దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది.

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

భార్య తన పుట్టింటికి వెళ్లి అక్కడ కొంతకాలం ఉండటం ఆమెకు ఉన్న చట్టపరమైన హక్కుల్లో భాగమేనని కోర్టు పేర్కొంది. అదే సమయంలో… భర్త తన సొంత ఇంటిని వదిలి భార్య ఇంట్లో ‘ఇంటల్లుడిగా’ ఉండాలా? వద్దా? అనేది అతని వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది.

అయితే… భార్య తనను ఇంటల్లుడిగా ఉండాలని కోరడం లేదా అందుకు ఒత్తిడి చేయడం మాత్రమే ఆధారంగా తీసుకుని దాన్ని మానసిక క్రూరత్వంగా పరిగణించి విడాకులు మంజూరు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

మరోవైపు భార్య తరఫు న్యాయవాది… తన క్లయింట్ భర్తతో కలిసి జీవించాలనే కోరుకుంటోందని, వివాహ బంధాన్ని ముగించాలని ఆమెకు ఎలాంటి ఉద్దేశం లేదని కోర్టుకు తెలిపారు.

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు… దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ భర్త విడాకుల పిటిషన్‌ను తిరస్కరించింది.

భార్యాభర్తల మధ్య ఇలాంటి కుటుంబ వివాదాల్లో ‘మానసిక క్రూరత్వం’ను నిర్ణయించేటప్పుడు కేవలం ఒకే అంశాన్ని ఆధారంగా తీసుకోలేమని ఈ తీర్పు స్పష్టం చేసింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *