కేంద్రపడ: ఒక వ్యక్తి తన జీవితంలో మూడు దశాబ్దాలకు పైగా రహస్యంగా గడిపాడు. ఆ రహస్య స్థలాన్ని అతనే సొంతంగా నిర్మించుకున్నాడు. హత్య కేసులో వాంటెడ్ ముద్దాయిగా ఉన్న అతను, ఏకంగా తన ఇంటి కింద సొరంగం వంటి భూగర్భ గదిని తవ్వుకుని, అందులోనే జీవనం సాగిస్తూ పోలీసుల కళ్లు గప్పాడు. సద్దాం హుసేన్ తరహాలో రహస్యంగా తలదాచుకున్న ఈ వ్యక్తి, 32 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
కేసు వివరాలు: ఈ ఘటన ఒడిశాలో జరిగింది. 58 ఏళ్ల రవీంద్ర మల్లిక్ అనే వ్యక్తి 1994లో తన సొంత చర్చిరపు సోదరుడు పరమానంద మల్లిక్ (27)ను గొడ్డలితో నరికి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. భువనేశ్వర్‌కు 95 కిలోమీటర్ల దూరంలోని జాజ్‌పూర్ జిల్లా, నుహాట్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఈ కేసులో కోర్టు అతడిని పరారీలో ఉన్న నేరస్తుడిగా (absconder) ప్రకటించింది. అప్పటి నుండి అతను కనిపించకుండా పోయాడు.
నకిలీ గుర్తింపు కార్డులు: అజ్ఞాతంలోకి వెళ్లిన రవీంద్ర, తన పేరు మార్చుకుని నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించుకున్నాడు. వలస కూలీగా మారువేషంలో ఉంటూ హైదరాబాద్, కేరళ వంటి రాష్ట్రాల్లో మేస్త్రీగా పనిచేశాడు. అదే సమయంలో, తన కుటుంబ సభ్యులతో రహస్యంగా టచ్‌లో ఉంటూ వచ్చాడు.
భూగర్భ గదిలోనే బంధీ: జాజ్‌పూర్ పోలీసులు అందిన పక్కా సమాచారంతో రవీంద్ర తన కుటుంబ వేడుక కోసం సొంత గ్రామానికి తిరిగి వచ్చినట్లు తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి పోలీసులు అతడి ఇంటిపై దాడి చేయగా, ఇంటి లోపల ఉన్న రహస్య తలుపు వెనుక నిర్మించుకున్న బంకర్లో అతను దాక్కుని ఉన్నట్లు గుర్తించారు. 1994లోనే అతను ఈ గదిని నిర్మించుకున్నాడని పోలీసులు తెలిపారు.
నిందితుడి జీవితం: పరారీలో ఉన్న సమయంలోనే 1998లో రవీంద్ర మల్లిక్, మంజులత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతను నిరంతరం తన అడ్రస్ మరియు గుర్తింపును మార్చుకుంటూ పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ వచ్చాడు.
