హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు కొరత ఏర్పడింది. దీని ప్రభావంతో భారతదేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో, సిలిండర్ల బుకింగ్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది.
దీంతో పాటు, గ్యాస్ పంపిణీ చేసే చమురు సంస్థలు కూడా కొన్ని ముఖ్యమైన మార్పులను చేపట్టాయి. ఈ నేపథ్యంలో, ఇండేన్ గ్యాస్ (Indane Gas) వినియోగదారులకు ఆ సంస్థ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. గ్యాస్ సిలిండర్లను నిరంతరాయంగా పొందాలంటే కొన్ని పనులను పూర్తి చేయాలని సూచించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
గ్యాస్ కనెక్షన్‌తో ఆధార్‌ను అనుసంధానించాలి
వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్‌తో ఆధార్ సంఖ్యను అనుసంధానించాలని ఇండేన్ సంస్థ కోరింది. ఒకవేళ ఆధార్ కార్డును లింక్ చేయకపోతే, సిలిండర్ సరఫరాలో అభ్యంతరాలు ఎదురుకావచ్చని మరియు సబ్సిడీ సొమ్ము నేరుగా ఖాతాలో జమ కావడంలో ఇబ్బందులు కలగవచ్చని సంస్థ తెలిపింది.
ఆన్లైన్ ద్వారా గ్యాస్ KYC చేయడం ఎలా?
గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియనే KYC (Know Your Customer) అంటారు. దీనిని ఆన్లైన్ ద్వారా చాలా సులభంగా పూర్తి చేయవచ్చు:
- ముందుగా ‘ఇండియన్ ఆయిల్ వన్’ (IndianOil One) యాప్‌ను ఓపెన్ చేసి, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
- మీ గ్యాస్ బిల్లుపై ఉండే 16 అంకెల LPG IDని లింక్ చేయాలి.
- హోమ్ పేజీలో ఉన్న ‘మై ప్రొఫైల్’ (My Profile) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ LPG Details విభాగంలోకి వెళ్లి, ఆ తర్వాత Indane Details విభాగానికి వెళ్లాలి.
- అక్కడ e-KYC ఆప్షన్‌ను ఎంచుకుని, నిబంధనలకు అంగీకారం తెలపాలి.
- తర్వాత ‘ఫేస్ స్కాన్’ (Face Scan) ఆప్షన్‌ను క్లిక్ చేసి బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
- చివరగా e-KYC రిక్వెస్ట్‌ను సబ్మిట్ చేయాలి.
పైన పేర్కొన్న పద్ధతిని అనుసరించిన తర్వాత, 24 నుండి 48 గంటల లోపు మీ e-KYC అప్డేట్ అవుతుంది.
