ఇక ఇబ్బంది పడకండి! తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే ఖచ్చితంగా టిక్కెట్ దొరుకుతుంది.

తత్కాల్ టిక్కెట్లు బుక్ చేయడం అనేది చాలా కష్టమైన ప్రక్రియగా చాలామంది భావిస్తారు. తత్కాల్ బుక్ చేసినా టిక్కెట్ దొరకకపోవడం లేదా వెయిటింగ్ లిస్ట్ (Waiting List) లోకి వెళ్లడం వంటివి జరుగుతుంటాయి. సరిగ్గా బుకింగ్ సమయానికే ఇంటర్నెట్ కనెక్షన్ స్లో అవ్వడం వంటి అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. దీనివల్ల చాలామంది టిక్కెట్లు దొరకక ప్రయాణాల్లో ఇబ్బంది పడుతుంటారు. అయితే దీనికి పరిష్కారం ఉంది. ఈ చిట్కాలు పాటిస్తే మీరు టెన్షన్ లేకుండా కన్ఫర్మ్డ్ టిక్కెట్లు పొందవచ్చు.

తత్కాల్ టిక్కెట్లను సులభంగా బుక్ చేయడం ఎలా? తత్కాల్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో లేదా రైల్వే కౌంటర్ వద్ద తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా ‘రైల్ కనెక్ట్’ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఏసీ (AC) క్లాస్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో ప్రతి సెకను చాలా ముఖ్యం.

  • ముందుగానే వివరాలు నింపండి: స్లీపర్ క్లాస్ బుకింగ్ 11 గంటలకు అయితే, మీరు 10:55 గంటలకే లాగిన్ అయి ఉండాలి. ప్రయాణీకుల పేర్లు, వయస్సు వంటి వివరాలను (Master List ద్వారా) ముందే సిద్ధంగా ఉంచుకోవాలి.
  • పేమెంట్ ఆప్షన్: పేమెంట్ చేయడానికి కావాల్సిన యూపీఐ (UPI) లేదా కార్డు వివరాలను సిద్ధంగా ఉంచుకోండి.
  • ఇంటర్నెట్ కనెక్షన్: వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోండి. వీలైతే వైఫై (Wi-Fi) వాడటం ఉత్తమం.
  • బుకింగ్ ప్రక్రియ: సరిగ్గా 11 గంటలకు ట్రైన్ సెర్చ్ చేసి ‘రీఫ్రెష్’ చేయండి. అప్పుడు అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య కనిపిస్తుంది. వెంటనే దానిపై క్లిక్ చేసి, క్యాప్చా (Captcha) ఎంటర్ చేసి పేమెంట్ పేజీకి వెళ్లండి. పొరపాటున కూడా ‘బ్యాక్’ బటన్ నొక్కకండి.

టిక్కెట్ దొరకడానికి మరో మార్గం: సాధారణ తత్కాల్‌లో రద్దీ వల్ల టిక్కెట్ దొరకని పక్షంలో ‘ప్రీమియం తత్కాల్’ (Premium Tatkal) ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇది కొంచెం ఖరీదైనదని చాలామంది దీని జోలికి వెళ్లరు. కానీ, బుకింగ్ ప్రారంభమైన వెంటనే దీనిని ఎంచుకుంటే తక్కువ ధరకే టిక్కెట్ దొరుకుతుంది. సమయం గడిచేకొద్దీ ఇందులో డిమాండ్‌ను బట్టి ధరలు పెరుగుతాయని గుర్తుంచుకోండి.


Posted

in

by

Tags: