భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం బెతుల్ (Betul) జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య జరుగుతున్న కుటుంబ గొడవను సర్దుమణిగించడానికి వచ్చిన పోలీసులపైనే ఆ దంపతులు తిరగబడి దాడి చేసిన ఉదంతం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.
స్థానిక సమాచారం ప్రకారం.. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఒక దంపతుల మధ్య వ్యక్తిగత విషయాలపై తీవ్రమైన గొడవ జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ఇరువర్గాలను కూర్చోబెట్టి నచ్చజెప్పాల్సింది పోయి, పోలీసులు ఒకపక్షంగా వ్యవహరిస్తూ హఠాత్తుగా భర్తపై లాఠీఛార్జ్ (లాఠీతో దాడి) చేయడం ప్రారంభించారని తెలుస్తోంది.
సొంత గొడవ మరిచి.. పోలీసులపై తిరగబడిన భార్య!
కళ్లముందే పోలీసులు తన భర్తను విచక్షణా రహితంగా కొట్టడం చూసి ఆ భార్య తట్టుకోలేకపోయింది. అంతవరకు భర్తతో ఉన్న గొడవను పక్కనబెట్టి, వెంటనే భర్తకు మద్దతుగా రంగంలోకి దిగింది. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ ఏకమై.. తమపై లాఠీ ఎత్తిన పోలీసులకు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చారు. రోడ్డుపైనే సినిమా ఫైట్ సీన్‌ను తలపించేలా పోలీసులను ఇద్దరూ కలిసి చితకబాదారు.
హద్దులు మీరి సామాన్య ప్రజలపై భౌతిక దాడికి దిగిన పోలీసులకు ఆ దంపతులు ఇచ్చిన ఈ షాకింగ్ రిటన్ గిఫ్ట్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. “ఎవరైనా కుటుంబ సమస్యల్లో జోక్యం చేసుకునేటప్పుడు పోలీసులు ఎంత సంయమనంతో, ఎలా ప్రవర్తించాలో చెప్పడానికి ఈ ఘటనే ఒక గుణపాఠం” అంటూ భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply