‘ఇతనితో హలాలా చెయ్’.. నిండు పంచాయతీలో తీర్పు; ప్రాధేయపడినా వినకుండా మహిళపై అరాచకం

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో విడాకులు తీసుకున్న ఒక నిస్సహాయ మహిళకు తీవ్ర అన్యాయం జరిగింది. విడాకుల తర్వాత ఆమె ‘ఇద్దత్’ (నిరీక్షణ కాలం) లో ఉండగా, మత పెద్దలు పంచాయతీని ఏర్పాటు చేసి, ఆమె వాదన వినకుండానే నేరుగా ‘హలాలా’ చేయాలని ఆదేశించారు.

జబర్‌దస్తీగా హలాలా ప్రయత్నం: బాధితురాలి ఆరోపణల ప్రకారం.. ఆమె హలాలాకు నిరాకరించడంతో, అక్కడున్న వారు ఆమెను పట్టుకుని బలవంతం చేశారు. ఒకవేళ ఈ ఆదేశాన్ని పాటించకపోతే ఇస్లాం మతం నుండి బహిష్కరిస్తామని (ఇస్లాం ఖారీజ్) బెదిరించారు. ఈ దారుణం నుండి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు న్యాయం కోసం బరేలీ ఎస్ఎస్‌పి (SSP) కార్యాలయానికి చేరుకుంది.

ఎస్పీకి ఫిర్యాదు: బరేలీ ఎస్ఎస్‌పి అనురాగ్ ఆర్య ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదైంది. నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, పంచాయతీకి హాజరైన పలువురు మౌలానాలు మరియు మత పెద్దల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు తన ఫిర్యాదులో.. తన అనుమతి లేకుండా తనపై శారీరక సంబంధం కోసం ఒత్తిడి తెచ్చారని, ప్రతిఘటించినందుకు సామాజిక బహిష్కరణకు పిలుపునిచ్చారని పేర్కొంది.

మత పెద్దల వివరణ: ఈ విషయంపై ముస్లిం మత గురువులు స్పందిస్తూ.. షరియత్ ప్రకారం హలాలా అనేది ఒక అంశమే అయినప్పటికీ, మహిళకు ఇష్టం లేకపోతే ఎవరూ బలవంతం చేయకూడదని స్పష్టం చేశారు. మహిళపై ఎలాంటి బలాత్కారం చేసినా అది నేరమేనని, అటువంటి చర్యలకు పాల్పడిన వారు షరియత్ దృష్టిలో కూడా నేరస్తులేనని వారు అభిప్రాయపడ్డారు.


Posted

in

by

Tags: