కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి (LDF) ఓటమిపై నటుడు వినాయకన్ స్పందించారు. రాష్ట్రంలో లభించిన ఈ విజయం కాంగ్రెస్‌ది కాదని, కేరళను మరో బెంగాల్‌గా మారనివ్వకూడదని భావించిన లెఫ్ట్ సానుభూతిపరుల విజయమని ఆయన తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
వినాయకన్ తన పోస్ట్‌లో ఇలా రాశారు: “కేరళను బెంగాల్‌గా మార్చడానికి ఇష్టపడని లెఫ్ట్ సానుభూతిపరులు (Left Co-travelers) ఎందరో ఉన్న రాష్ట్రం ఇది. కేరళ బెంగాల్ కాకూడదు. అవ్వనివ్వం. ఈ ఓటమి రాబోయే మహా విజయం కోసం చేసే ఆలోచనలకు నాంది కావాలి. ఇది కాంగ్రెస్ విజయం కాదు, లెఫ్ట్ సానుభూతిపరుల విజయం. ఆలోచించండి.”
వామపక్ష కూటమి ఓటమిపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. పదవి నుంచి తప్పుకుంటున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సెరి పోస్ట్ చేశారు. అటు పేరావూర్లో కే.కే. శైలజ ఓటమిపై నటి రిమా కల్లింగల్ నిరాశ వ్యక్తం చేశారు.
ఎన్నికల ఫలితాల ప్రకారం, గత పదేళ్లుగా కేరళను పాలించిన సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కేవలం 35 సీట్లకు పరిమితమైంది. ఓడిపోయిన వారిలో 13 మంది మంత్రులు, ఎల్డీఎఫ్ కన్వీనర్ కూడా ఉన్నారు. మరోవైపు, 102 సీట్లు గెలుచుకున్న యూడీఎఫ్ (UDF) అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
