పొరుగు దేశమైన పాకిస్తాన్ నుంచి సోషల్ మీడియాలో బయటకు వచ్చిన ఒక వీడియో ప్రస్తుతం నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే, ఆ దేశ వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నాకు ఇంగ్లీషులో నివాళులర్పించేందుకు ప్రయత్నించి పడ్డ పాట్లు ప్రస్తుతం నెటిజన్లకు ఫుల్ మీమ్ మెటీరియల్‌గా మారాయి.
కరాచీలోని కెమారీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు ముహమ్మద్ షబ్బీర్ ఖురేషీకి, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జిన్నా ఘనతను కొనియాడుతూ రూపొందించిన సంక్లిష్టమైన ఆంగ్ల ప్రసంగ పత్రాన్ని చదివే అవకాశం లభించింది.
అయితే, ఆయన ఆంగ్లంలో చదవడం ప్రారంభించిన మరుక్షణమే చూసే ప్రేక్షకులకు అదొక హారర్ సినిమా చూసినంత పనైంది! ఒక్కో పదాన్ని పలకడానికి ఆయన పడ్డ అవస్థలు వర్ణనాతీతం. ఆంగ్ల ఉచ్చారణ రాక ఆయన తడబడుతున్న తీరును చూసిన నెటిజన్లు, ‘పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం ఇది చూస్తే తలలు బాదుకుంటారు’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ప్రతి వాక్యానికి ఆగుతూ, నానా తంటాలు పడుతూ చదివిన ఆయన.. ఒకానొక దశలో తట్టుకోలేక పక్క సీట్లో కూర్చున్న తోటి అసెంబ్లీ సభ్యుడి సాయం కూడా కోరారు. ఆయన పడుతున్న పాట్లు చూస్తుంటే.. అసలు ఇంగ్లీష్ చదువుతున్నారా లేక విదేశీ రహస్య కోడ్లను డీకోడ్ చేస్తున్నారా అనే అనుమానం ఎవరికైనా కలగక మానదు.
ఈ వీడియో బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియా మొత్తం మీమ్స్‌తో నిండిపోయింది. ‘లండన్‌లోని లింకన్స్ ఇన్‌లో న్యాయవిద్యను అభ్యసించిన జిన్నా, తన కోసం ఇలాంటి ఇంగ్లీష్ నివాళి అర్పిస్తుండటం చూస్తే చెవులు మూసుకుని పారిపోయేవారేమో!’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘అంత కష్టపడే బదులు చక్కగా ఉర్దూలోనే మాట్లాడొచ్చు కదా!’ అంటూ మరొకరు చురకలు అంటించారు.
ఇంగ్లీష్ రానప్పుడు మాతృభాషలోనో లేదా ఉర్దూలోనో మాట్లాడవచ్చు కదా, ఇలాంటి అనవసర తిప్పలు ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. సభలో మాట్లాడటానికి ముందు ఆయన సహాయకులు కనీస శిక్షణ ఎందుకు ఇవ్వలేదంటూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఈ ఉదంతంపై ఖురేషీ నుంచి ఎలాంటి వివరణ రాకపోయినప్పటికీ, ఈ వైరల్ వీడియో మాత్రం నెటిజన్లకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది!

Leave a Reply