“ఇది నిరసనా లేక సరదాగా చిల్ అయ్యే చోటా?”.. నెలవారీ గౌరవ వేతనం పెంచాలంటూ వినూత్న పోరాటం.. వైరల్ అవుతున్న డాక్టర్ల వీడియో..!

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జూనియర్/ఇంటర్న్ వైద్యులు తమ నెలవారీ గౌరవ వేతనాన్ని (స్టైపెండ్) రూ.14,337 నుంచి రూ.30,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది.

హమీదియా ఆసుపత్రి వెలుపల ఆందోళనకారులపై పోలీసులు నీటి ఫిరంగులను (వాటర్ కానన్స్) ప్రయోగించడంతో ఈ నిరసన మరింత ఉద్రిక్తంగా మారింది. మరోవైపు, వీఐపీ రోడ్డులో దాదాపు ఒక కిలోమీటరు మేర నిరసనకారులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సాధారణ నిరసనల తరహాలో కాకుండా, నేటి ‘జెన్-జీ’ (Gen-Z) శైలిలో ఈ పోరాటాన్ని వినూత్నంగా నిర్వహించడం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. నిరసన ప్రాంగణంలోనే చాపలు పరుచుకుని కూర్చుని.. తోటి వైద్యులతో కలిసి ‘యూనో’ (UNO) కార్డ్స్ ఆడటం, క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం, కలసి భోజనం చేయడం వంటి పనులతో యువ డాక్టర్లు సందడి చేశారు. అంతేకాకుండా, నిరసన వేదిక వద్దే తోటి వైద్యుడి పుట్టినరోజు సందర్భంగా కేక్ కోసి సంబరాలు చేసుకోవడంతో పాటు, నిరసన ముగిశాక ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశుభ్రం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

పోలీసుల లాఠీఛార్జ్, జలఫిరంగుల దాడి ఘటనలకు పరిహారం చెల్లించడంతో పాటు, ఆ చర్యలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులు పట్టుబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన వేలాది మంది ఎంబీబీఎస్ ఇంటర్న్ వైద్యులు తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వచ్చే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


Posted

in

by

Tags: