రైలు ప్రయాణంలో కొందరు మహిళలు గుంపుగా చేరి పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ‘మహిళా సంగీత్’ తరహాలో వేడుక చేసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
రైలులో ప్రయాణిస్తున్న ఆ మహిళలు తమ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో.. అది పబ్లిక్ ప్లేస్ అనే విషయాన్ని మర్చిపోయి, తోటి ప్రయాణికుల ఇబ్బందులను పట్టించుకోకుండా ఇలాంటి సంబరాలకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఆ మహిళల నిరంతర పాటలు, అరుపులు, కేకల వల్ల ఆ రైలు బోగీలోని ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. దీనిని గమనించిన టిక్కెట్ చెకింగ్ అధికారి (TTE) అక్కడికి వచ్చి, ఎంతో శాంతంగా ఆ మహిళలకు పరిస్థితిని వివరించారు. రైలు అనేది అందరూ కలిసి ప్రయాణించే ఒక పబ్లిక్ ప్రదేశమని, ఇతర ప్రయాణికుల ప్రయాణానికి ఎలాంటి భంగం కలగకుండా ప్రశాంతతను పాటించాలని ఆ మహిళలకు హితవు పలికి వారి పాటల కచేరీని ఆపించారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ‘ఎక్స్’ (ట్విట్టర్) సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విడుదలై నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. పబ్లిక్ ప్లేసుల్లో ఎలా ప్రవర్తించాలనే కనీస పౌర స్పృహ (Civic Sense) చాలామందికి ఉండటం లేదంటూ పలువురు ఆ మహిళల ప్రవర్తనను తప్పుబడుతున్నారు. అదే సమయంలో, ఎలాంటి వాగ్వాదానికి తావు లేకుండా ఎంతో సహనంతో, హుందాగా పరిస్థితిని చక్కదిద్దిన సదరు రైల్వే అధికారి సమయస్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Leave a Reply