గురుశిష్యుల మధ్య ఉండాల్సిన పవిత్ర బంధాన్ని గుర్తుచేసే పర్వదినమే ఉపాధ్యాయ దినోత్సవం. కానీ, అదే శుభదినాన పాఠశాల ప్రాంగణాన్నే బాక్సింగ్ రింగ్గా మార్చేసిన ఉపాధ్యాయుల సిగ్గుచేటు వ్యవహారం బీహార్లోని రోహ్తాస్ జిల్లాను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
రోహ్తాస్ జిల్లా నోఖా నియోజకవర్గ పరిధిలోని సంగి ఉన్నత పాఠశాలలో ఈ విచారకర సంఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరగాల్సిన వేళ.. ఆ పాఠశాల ఉపాధ్యాయుల మధ్య అకస్మాత్తుగా తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఆ వివాదం కాస్తా కొద్ది నిమిషాల్లోనే అసభ్య పదజాలంతో తిట్టుకుంటూ పరస్పర దాడులు చేసుకునే స్థాయికి చేరింది.
ఈ ఘర్షణ పతాక స్థాయికి చేరి ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు కలిసి ఓ పురుష టీచర్పై దాడి చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అక్కడే ఉన్న మరో ఉపాధ్యాయుడు తన మొబైల్ ఫోన్లో ఈ కొట్లాటను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో దావానలంలా వైరల్ అయింది. యావత్ ఉపాధ్యాయ లోకమే తలదించుకునేలా చేసిన ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది.
సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో జిల్లా విద్యాశాఖ తక్షణమే రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణ అనంతరం.. పాఠశాల ప్రతిష్టను, క్రమశిక్షణను దిగజార్చిన ఐదుగురు ఉపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) మదన్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో అంజు కుమారి (ఉపాధ్యాయురాలు), ఉమా కుమారి (ఉపాధ్యాయురాలు), అభిషేక్ ఉపాధ్యాయ్ (దాడికి గురైన ఉపాధ్యాయుడు), నిత్యానంద్ భారతి (ఉపాధ్యాయుడు), ఉమేష్ కుమార్ (ఉపాధ్యాయుడు) ఉన్నారు. పాఠశాల ఆవరణలోనే ఉపాధ్యాయులే ఇలా పరస్పరం దాడులకు తెగబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
