మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన కామెడీ షో ద్వారా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మరాఠీ నటి వనితా ఖరత్. తన అద్భుతమైన హాస్య నటనతో భారీగా అభిమానులను సంపాదించుకున్న ఆమె, ప్రస్తుతం బరువు తగ్గేందుకు తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారు.
గత కొన్ని నెలలుగా బరువు తగ్గేందుకు వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్న వనిత, వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో శరీరాన్ని దృఢంగా మార్చుకునేందుకు ఆమె ఎంచుకున్న ఒక సంప్రదాయ వ్యాయామ విధానం నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
ఇటీవల ఆమె పోస్ట్ చేసిన వీడియోలో, భారతీయ సంప్రదాయ వ్యాయామ పద్ధతి అయిన ‘ముద్గల్’ (గద లాంటి చెక్క దుడ్డు) తిప్పుతూ ఆశ్చర్యపరిచారు. వ్యాయామం ప్రారంభించే ముందు ఆ ముద్గల్ చెక్కను తాకి నమస్కరించిన ఆమె, ఆ తర్వాత దాన్ని ఒంటిచేత్తో, అనంతరం రెండు చేతులతో ఎంతో నేర్పుగా తిప్పుతూ కసరత్తు చేశారు.
మొదట తక్కువ బరువున్న ముద్గల్తో, ఆ తర్వాత ఎక్కువ బరువున్న దాంతో ఆమె చేసిన ఈ కసరత్తు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు, “శరీర ఆకారం కంటే బలం ముఖ్యం”, “నువ్వు నిజంగా చాలా దృఢమైన మహిళవి, ఎందరికో ఆదర్శం” అంటూ వనిత పట్టుదలను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ వీడియో కింద ఆమె సహనటి ప్రియదర్శిని ఇందల్కర్ చేసిన కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. “ఇలాంటి సంప్రదాయ వ్యాయామాలు చేయడానికి అపారమైన ధైర్యం, అమితమైన శారీరక బలం కావాలి.. అవి నీలో పుష్కలంగా ఉన్నాయి వనీ!” అంటూ మనస్ఫూర్తిగా కొనియాడారు. బరువు తగ్గడానికి వనితా ఖరత్ ఎంచుకున్న ఈ సంప్రదాయ విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
