భారతీయ ఐటీ రాజధాని బెంగళూరులో అద్దె ఇల్లు వెతకడం, సరైన రూమ్మేట్ను దక్కించుకోవడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలుగానే ఉంటుంది.
అయితే, ఇక్కడి ఒక యువతి తన అద్దె ఇంటికి ఒక ‘ఫేక్ (నకిలీ) ఫిమేల్ రూమ్మేట్’ కావాలంటూ సోషల్ మీడియాలో పెట్టిన ప్రకటన, నెటిజన్ల దృష్టిని ఆకర్షించడమే కాకుండా నవ్వుల పువ్వులు పూయించి పెద్ద చర్చకే దారితీసింది.
బంధువుల వరుస ప్రశ్నల నుంచి, వారు పెట్టే మానసిక ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికే ఆమె ఇలాంటి విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. ఒంటరిగా అద్దె ఇంట్లో నివసిస్తున్న ఆ అమ్మాయిని, ఆమె బంధువులు తరచూ “ఎందుకు ఒంటరిగా ఉంటున్నావు, నీతో పాటు ఎవరైనా అమ్మాయి రూమ్మేట్గా ఉందా, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?” అంటూ ప్రశ్నలతో వేధించేవారు.
ఈ వేధింపులు తట్టుకోలేక, “నాకు ఒక ఫేక్ ఫిమేల్ రూమ్మేట్ కావాలి. మా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు లేదా ఫోన్ చేసి విచారించినప్పుడు మీరు నా రూమ్మేట్లా నటించాలి; దీనికి మీరేమీ అద్దె కట్టాల్సిన అవసరం లేదు” అని తన సోషల్ మీడియా ఖాతాలో సరదాగా పోస్ట్ చేసింది.
ఆ అమ్మాయి ఈ ప్రకటన పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే, ఆమె ఇన్‌బాక్స్‌లో దాదాపు 150 కి పైగా మెసేజ్‌లు వచ్చి పడ్డాయి. “నాకు కూడా బంధువుల గోల ఎక్కువైంది, నేనే వచ్చి మీతో ఉంటాను”, “నాకు జీతం కూడా వద్దు, ఆ చుట్టాలను ఎలా సముదాయించాలో (ఫేస్ చేయాలో) ఆ విద్య నాకు తెలుసు, నేనే చేస్తాను” అంటూ ఎంతోమంది అమ్మాయిలు, యువకులు పోటీపడి మరి తమ ఆసక్తిని తెలిపారు.
బంధువులు పెట్టే సామాజిక ఒత్తిడి, వ్యక్తిగత స్వేచ్ఛలో వారు జోక్యం చేసుకోవడం నేటి యువతకు ఏ స్థాయిలో పెద్ద సమస్యగా మారిందో ఈ ఒక్క పోస్ట్ చాలా చక్కగా లోకానికి చాటిచెప్పింది.

Leave a Reply