ఢిల్లీకి చెందిన సుమారు 50 ఏళ్ల మహిళకు ఏకంగా రూ. 200 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపు కాల్ వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఓ విదేశీ నంబర్ నుంచి వచ్చిన వాట్సాప్ కాల్లో మాట్లాడిన వ్యక్తి, తాను గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్నని పరిచయం చేసుకున్నట్లు సమాచారం. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సదరు మహిళను, ఆమె భర్తను చంపేస్తామని హెచ్చరించాడు. ఢిల్లీ చరిత్రలోనే ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద బెదిరింపు వసూలు (ఎక్స్టార్షన్) డిమాండ్లలో ఇది ఒకటి కావచ్చని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీలో నివాసముంటున్న ఆ మహిళకు సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి సుమారు 10:44 గంటలకు విదేశీ నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్లో మాట్లాడిన దుండగుడు ఆమె గురించిన సమగ్ర సమాచారం తన దగ్గర ఉందని పేర్కొన్నాడు. వెంటనే రూ. 200 కోట్లు చెల్లించాలని, లేకుంటే ఆమెను, భర్తను హతమారుస్తామని బెదిరించాడు. ఆ ప్రాంతంలో సదరు మహిళకు భారీగా వారసత్వ ఆస్తులు ఉన్నట్లు విచారణలో తేలింది.
అయితే ఈ బెదిరింపు నిజంగా గోల్డీ బ్రార్ నుంచే వచ్చిందా లేక ఎవరైనా అతని పేరును వాడుకుని బెదిరించారా అనేది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. వ్యక్తిగత కక్షలు లేదా ఆస్తి తగాదాల నేపథ్యంలో గోల్డీ బ్రార్ పేరును దుర్వినియోగం చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. దీనిపై సెప్టెంబర్ 10న భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 351(4), 308(4), 61(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
బెదిరింపు వచ్చిన విదేశీ ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కాల్ వెనుక ఎవరున్నారు, రూ. 200 కోట్ల భారీ మొత్తాన్ని ఎందుకు డిమాండ్ చేశారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. గతంలోనూ పలువురు గోల్డీ బ్రార్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడిన దాఖలాలు ఉండటంతో, ఈ కేసులోనూ ఉద్దేశపూర్వకంగానే ఆ పేరు వాడారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
