“ఒక విమాన వాహక నౌక (Aircraft Carrier) ప్రమాదకరమైన యంత్రం కావచ్చు. కానీ దానిని సముద్ర గర్భానికి పంపగల ఆయుధం అంతకంటే ప్రమాదకరమైనది” అని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక దాడులు చేస్తామని పలుమార్లు హెచ్చరిస్తున్నారు. తన విమాన వాహక నౌకల్లో ఒకదానిని మధ్యప్రాచ్యానికి పంపారు. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక అయిన ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్’ కూడా అదే దిశలో పయనిస్తోంది. ట్రంప్ ఇరాన్‌పై వాగ్ధాటిని కొనసాగిస్తున్నప్పటికీ, ఇరాన్ విషయంలో ఆయన ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధికారులు చెబుతున్నారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఇటీవల నిర్వహించిన సైనిక విన్యాసాలే ట్రంప్ వెనకడుగు వేయడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
ట్రంప్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఖమేనీ ఫిబ్రవరి 17న చేసిన ప్రసంగం ఇక్కడ కీలకం. అమెరికా యుద్ధ నౌకలను ముంచేయడానికి ఇరాన్ ఏ ఆయుధాన్ని ఉపయోగిస్తుందో ఆయన నేరుగా చెప్పనప్పటికీ, వారి అమ్ములపొదిలో ఉన్న క్షిపణులు శత్రువులకు వణుకు పుట్టిస్తున్నాయి.
ఇరాన్ వద్ద ఉన్న విధ్వంసకర ఆయుధాలు:
- ఫతా-1 (Fattah-1): ఇది మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి. ఇది శబ్ద వేగం కంటే 15 రెట్లు అధిక వేగంతో (Mach 15) ప్రయాణిస్తుంది. దీని పరిధి 1,400 కిలోమీటర్లు. ఇది ఎంతటి అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థనైనా ఛేదించగలదు.
- ఫతా-2 (Fattah-2): నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ‘హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్’ను కలిగి ఉంటుంది. ఇది ఊహించని మార్గాల్లో ప్రయాణిస్తుంది, దీనివల్ల రాడార్లకు చిక్కడం చాలా కష్టం.
నౌకలను కూల్చే ఇతర క్షిపణులు: ఇరాన్ వద్ద సుమారు 1,000 నుండి 1,200 వరకు యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. వాటిలో కొన్ని:
- నూర్ (Noor): 120-170 కి.మీ పరిధి.
- ఖాదర్ (Qader): 200 కి.మీ పరిధి.
- ఖదీర్ (Ghadir): 300 కి.మీ పరిధి.
- రాడ్ (Raad): 350 కి.మీ పరిధి.
