దేశంలో ఎల్పిజి (LPG) కొరత పెరుగుతున్న తరుణంలో సముద్ర సరిహద్దుల నుండి ఊరటనిచ్చే వార్త అందింది. గత కొన్ని రోజులుగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’లో నిలిచిపోయిన భారతీయ గ్యాస్ ట్యాంకర్ల కదలికలపై కీలక అప్డేట్ వచ్చింది.
ప్రయాణానికి సిద్ధమైన ట్యాంకర్లు: షిప్పింగ్ డేటా ప్రకారం, భారత్కు చెందిన రెండు ఎల్పిజి ట్యాంకర్లు ‘పైన్ గ్యాస్’ (Pine Gas) మరియు ‘జగ్ వసంత్’ (Jag Vasant) తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. గల్ఫ్ దేశాల నుండి వచ్చే ఓడలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో వందలాది ఓడలు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే, శుక్రవారం ఈ రెండు భారతీయ ట్యాంకర్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సమీపంలో తమ ప్రయాణ సంకేతాలను (Broadcast) ఇచ్చాయి.
ముడి చమురు పరిస్థితి ఏమిటి? రాయిటర్స్ నివేదికల ప్రకారం, గత 24 గంటల్లో ఈ మార్గం నుండి ఎటువంటి ముడి చమురు (Crude Oil) ట్యాంకర్లు ప్రయాణించలేదు. కానీ, ఉద్రిక్తతల మధ్య భారతీయ ఎల్పిజి ట్యాంకర్లు ముందుకు కదలడం ఒక ముఖ్యమైన పరిణామం. ‘జగ్ వసంత్’ను BPCL, ‘పైన్ గ్యాస్’ను IOC సంస్థలు లీజుకు తీసుకున్నాయి. గత వారం కూడా ఇరాన్ రెండు భారతీయ ఓడలను వెళ్లడానికి అనుమతించింది, ఇది భారత దౌత్య విజయంగా భావిస్తున్నారు.
ప్రధాని మోదీ పర్యవేక్షణ: ఈ మొత్తం వ్యవహారాన్ని భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 22 భారతీయ ఓడల ‘సురక్షిత ప్రయాణం’ కోసం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రపంచ నాయకులతో చర్చిస్తున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి రాజేష్ కుమార్ సిన్హా పేర్కొన్నారు.
