అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన దాడులతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ కూడా ఈ దాడులను ధీటుగా ఎదుర్కొంటూ, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఎదురుదాడులు ప్రారంభించింది.
ఈ క్రమంలో యుద్ధభూమి నుండి అమెరికా ఆందోళనను పెంచే వార్త ఒకటి వెలువడింది. ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది డొనాల్డ్ ట్రంప్ మరియు అమెరికా రక్షణ వ్యవస్థకు పెద్ద దెబ్బగా పరిగణించబడుతోంది.
అమెరికా సైనికుల మృతి
అమెరికన్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) సోషల్ మీడియా ద్వారా ఈ వివరాలను వెల్లడించింది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) లో భాగంగా ముగ్గురు సైనికులు వీరమరణం పొందారని, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన తర్వాత అమెరికా సైన్యానికి తగిలిన మొదటి పెద్ద దెబ్బ ఇదే.
ష్రాప్‌నెల్ (క్షిపణి శకలాల) వల్ల గాయాలు
మరికొందరు సైనికులు క్షిపణి శకలాల (Shrapnel) వల్ల గాయపడ్డారని, వారికి ప్రాథమిక చికిత్స అందించి తిరిగి విధుల్లోకి పంపుతున్నామని సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరణించిన సైనికుల కుటుంబాలకు సమాచారం అందించిన 24 గంటల తర్వాత వారి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని సైన్యం పేర్కొంది.
కొనసాగుతున్న దాడులు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు రెండో రోజూ కొనసాగుతున్నాయి. వీటికి ప్రతికారంగా ఇరాన్ సైన్యం మధ్యప్రాచ్యంలోని నౌకలను మరియు అమెరికాకు మద్దతు ఇచ్చే దేశాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేస్తోంది. ఇటు ఇజ్రాయెల్ వైపు జెరూసలేం సమీపంలో జరిగిన దాడిలో ఎనిమిది మంది మరణించినట్లు సమాచారం. ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తో పాటు పలువురు కీలక నేతలు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply