కొన్ని సందర్భాల్లో ప్రేమను వ్యక్తపరచడానికి పెద్ద పెద్ద బహుమతులో, ఆర్భాటపు మాటలో అక్కర్లేదు; ఆపదలో లేదా అవసరమైన సమయంలో ఒకరికొకరు చేసుకునే చిన్న సాయమే సరిపోతుంది.
ఆ కోవలోనే, అనారోగ్యంతో ఉన్న తన భార్యకు సాయం చేసేందుకు.. ఆమె పనిచేసే ఇంటికే స్వయంగా వచ్చి వంటగదిలో ఆమెతో కలిసి పనిచేసిన ఒక భర్త వీడియో నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పనిమనిషిగా పనిచేస్తున్న తన భార్యకు ఒంట్లో బాగోలేదని తెలుసుకున్న ఆ భర్త, ఆమె ఒక్కతే కష్టపడకూడదని భావించి వెంటనే సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఇద్దరూ కలిసి కిచెన్లో పనులు చేసుకుంటున్న దృశ్యం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. భార్య పడే కష్టాన్ని అర్థం చేసుకుని ఆమెకు తోడుగా నిలిచిన ఆ భర్త తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ వీడియోను పూర్ణా శ్రీవత్స అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. అందులో, అనారోగ్యం కారణంగా తన ఇంట్లో పనిచేసే పనిమనిషికి తోడుగా ఆమె భర్త కూడా సాయం చేయడానికి వచ్చారని పేర్కొన్నారు. భార్య పని త్వరగా ముగియాలనే ఉద్దేశంతో భర్త కూడా వంటింట్లో ఆమెతో కలిసి పనులు చేశాడు. దీన్ని చూసిన పలువురు నెటిజన్లు.. “ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు; అవసరమైన సమయంలో చేతల్లో చేసి చూపించడం” అంటూ ప్రశంసలు కురిపించారు. ఆదర్శవంతమైన జీవిత భాగస్వామికి ఈ ఘటనే నిదర్శనమని కామెంట్లు పెట్టారు.
ఈ వీడియో పోస్ట్ చేసిన ఇంటి యజమానురాలు తర్వాతి పోస్టులో మరింత వివరణ ఇచ్చారు. సదరు మహిళ పనికి వచ్చేముందు తనకు ఒంట్లో బాగోలేదన్న విషయం చెప్పలేదని, ఇంటికి వచ్చిన తర్వాతే ఆమె ఆరోగ్యం బాగోలేదని తెలిసిందని పేర్కొన్నారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు సెలవు తీసుకుని విశ్రాంతి తీసుకోవచ్చని తాను చెప్పినట్లు ఆమె వెల్లడించారు. జీవితంలో పెద్ద పెద్ద విషయాల కంటే కూడా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే ఎంతో అర్థవంతమైనవని ఆమె పేర్కొన్నారు.
ఈ వీడియోపై నెటిజన్ల నుండి విభిన్న స్పందనలు వచ్చాయి. భర్త చేసిన పనిని మెచ్చుకుంటూ.. “ఇలాంటి భర్త దొరకడం నిజంగా అదృష్టం” అని పలువురు మహిళలు కామెంట్లు పెట్టారు. కొందరు తమ జీవితాల్లోనూ ఇలాంటి అనుభవాలు ఉన్నాయని, అనారోగ్య సమయాల్లో తమ భర్తలు ఇంటి పనులన్నీ చూసుకుంటారని పంచుకున్నారు. ఏదేమైనా, కష్టకాలంలో భార్యకు అండగా నిలిచిన ఆ భర్త చూపిన స్వచ్ఛమైన ప్రేమ నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది.

Leave a Reply