బెంగళూరుకు చెందిన ఓ సంస్థ CEO సోషల్ మీడియాలో చేసిన ఓ ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులను ఇకపై తమ సంస్థలో ఉద్యోగాల్లోకి తీసుకోబోమని A1 Sports World సంస్థ వ్యవస్థాపకుడు, CEO కార్తిక్ ఎస్.జీ ప్రకటించారు.
ఈ నిర్ణయానికి కారణంగా ఓ మాజీ ఉద్యోగికి సంబంధించిన ఘటనను, మహిళా ఉద్యోగుల భద్రతపై ఉన్న ఆందోళనలను ఆయన ప్రస్తావించారు.
అసలు ఏం జరిగింది?
కార్తిక్ ఎస్.జీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు రెండు వారాల క్రితం తమ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదని, దీంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు.
ఆ ఉద్యోగి పైన పేర్కొన్న నాలుగు రాష్ట్రాల్లో ఒకదానికి చెందిన వ్యక్తి అని కార్తిక్ చెప్పారు. మహిళా ఉద్యోగులతో అతను దురుసుగా ప్రవర్తించాడని, ఒక మహిళా ఉద్యోగిపై బలవంతంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి స్వతంత్రంగా ధృవీకరించబడిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.
తమ సంస్థ పిల్లలతో కూడా పనిచేస్తుందని, అందువల్ల ఉద్యోగులు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని CEO తెలిపారు.
సంస్థలో 32 మంది ఉద్యోగులు
తమ సంస్థలో మొత్తం 32 మంది ఉద్యోగులు ఉన్నారని, వారిలో 14 మంది మహిళలు ఉన్నారని కార్తిక్ వెల్లడించారు. వివిధ రాష్ట్రాలు, వివిధ మతాలకు చెందిన వారు తమ సంస్థలో పనిచేస్తున్నారని చెప్పారు. రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగి కూడా తమ సంస్థలో పనిచేస్తున్నారని, ఆమె ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా.. సోషల్ మీడియాలో వచ్చిన విమర్శల నేపథ్యంలోనూ తన నిర్ణయాన్ని కొనసాగిస్తానని కార్తిక్ మరో పోస్టులో స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
CEO ప్రకటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక ఉద్యోగి ప్రవర్తనను ఆధారంగా చేసుకుని, మొత్తం నాలుగు రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులందరినీ ఒకే విధంగా చూడటం సరైనదేనా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థులను వారి రాష్ట్రం ఆధారంగా కాకుండా.. వారి అర్హతలు, అనుభవం, వ్యక్తిగత ప్రవర్తన ఆధారంగా అంచనా వేయాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో, కార్యాలయంలో మహిళలు, పిల్లల భద్రతపై CEO ఆందోళనను అర్థం చేసుకోవచ్చని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
దీంతో ఈ వ్యవహారం ఉద్యోగ నియామకాల్లో ప్రాంతీయ నేపథ్యం, వ్యక్తిగత ప్రవర్తన, కార్యాలయ భద్రత వంటి అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

Leave a Reply