అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధాన్ని ముగించే సంకేతాలు ఇచ్చారు. లక్ష్యాలు నెరవేరబోతున్నాయని, అమెరికా దళాలు త్వరలోనే ‘పని పూర్తి చేస్తాయని’ ఆయన పేర్కొన్నారు. గురువారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) జాతిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ సహా పలు దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇరాన్ పాలన అంతమైందని ప్రకటించారు.
అమెరికా లక్ష్యం ఏమిటి?
జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్ ఇలా అన్నారు: “నా ఉద్దేశ్యం చాలా సరళం మరియు స్పష్టం. అమెరికాను బెదిరించే లేదా తన సరిహద్దుల వెలుపల బలాన్ని ప్రదర్శించే ఇరాన్ ప్రభుత్వ సామర్థ్యాన్ని మేము క్రమపద్ధతిలో అణిచివేస్తున్నాం. అంటే ఇరాన్ నౌకాదళాన్ని అంతం చేయడం, అది ఇప్పుడు పూర్తిగా ధ్వంసమైంది.” వారి వైమానిక దళం మరియు క్షిపణి ప్రోగ్రామ్‌కు ముందెన్నడూ చూడని విధంగా నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు.
త్వరలో ముగియనున్న మిషన్
తమ సైన్యం ప్రదర్శన అసాధారణంగా ఉందని ట్రంప్ కొనియాడారు. “చరిత్రలో ఇలాంటిది ముందెన్నడూ చూడలేదు, ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మా వ్యూహాత్మక లక్ష్యాలు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను,” అని ఆయన అన్నారు. మన పిల్లలు భవిష్యత్తులో అణు ఆయుధాలు ఉన్న ఇరాన్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం రాకుండా ఉండటం కోసం ప్రాణత్యాగం చేసిన 13 మంది అమెరికన్ యోధులను ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.
ఈ దేశాలకు థాంక్స్
ట్రంప్ పలు దేశాలను ప్రస్తావిస్తూ.. “మధ్యప్రాచ్యంలో మా సహచరులైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, కువైట్ మరియు బహ్రెయిన్‌లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు చాలా మంచివారు, మేము వారికి ఎటువంటి నష్టం కలగనివ్వము. వారిని విఫలం కానివ్వము,” అని భరోసా ఇచ్చారు. యుద్ధం మధ్యలో యూఏఈ మరియు సౌదీ అరేబియా అమెరికాకు మద్దతు ఇచ్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు
ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతూ ఇరాన్ గల్ఫ్ దేశాలలోని వివిధ ప్రాంతాలపై డ్రోన్ దాడులు చేసింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ఇంధన ట్యాంకర్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని కువైట్ పౌర విమానయాన సంస్థ బుధవారం తెలిపింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఒక వ్యాపార సంస్థలో అగ్నిప్రమాదం జరిగినట్లు ధృవీకరించింది. ఖతార్ తీరం సమీపంలో ఒక ట్యాంకర్ కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలపై ఈ దాడుల ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికా-ఇజ్రాయెల్ బాంబు దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఈ దాడులు చేస్తోంది. గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన కేంద్రాలు సహా కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.
