ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బలరాంపూర్ జిల్లాలోని ధౌర్‌పూర్ గ్రామంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు, వర్షాకాలంలో రోజూ అత్యంత కష్టమైన మార్గాన్ని దాటుకుని పాఠశాలకు వెళ్తున్నారు.
ముందుగా ఒక నిర్ణీత ప్రదేశంలో తమ స్కూటీని పార్క్ చేసి, అక్కడి నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరం కొండప్రాంతం, రాళ్లతో కూడిన మార్గంలో నడవాలి. ఆ తర్వాత మోరన్, ఇరియా నదులు సంగమించే ప్రాంతాన్ని దాటితేనే పాఠశాలకు చేరుకోగలరు.
ఉపాధ్యాయురాలు సంధ్యా హల్దర్‌కు 9 నెలల పసికందు ఉంది. చాలాసార్లు బిడ్డను చేతిలో ఎత్తుకుని ఆమె నదిని దాటి బడికి వెళ్తుంటారు. భారీ వర్షాలు కురిసే సమయంలో నదిలో నీరు నడుము నుంచి పొట్ట వరకు ఉంటుందని ఆమె తెలిపారు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉంటే నదిని దాటలేక వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని చెప్పారు.
మరో ఉపాధ్యాయురాలు కర్మిలా టోప్పో కూడా ఇదే మార్గంలో పాఠశాలకు వెళ్తారు. 2014వ సంవత్సరం నుంచి ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఆమె, ప్రతి వర్షాకాలంలోనూ ఈ కష్టాలను ఎదుర్కొంటున్నారు. నదిలో నీరు తక్కువగా ఉంటే మాత్రమే నదిని దాటి బడికి వెళ్తారు. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెనుతిరుగుతున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
ఈ ఉపాధ్యాయులు పడుతున్న కష్టాల గురించి తెలుసుకున్న బలరాంపూర్ జిల్లా కలెక్టర్ చందన్ సంజయ్ త్రిపాఠి.. వారి కృషిని అభినందించారు. బడిలో చదువుకునే పిల్లలు ఉపాధ్యాయుల కోసం ఎదురుచూస్తుంటారని, వారిని చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కష్టమైన ప్రయాణం చేస్తున్నట్లు సంధ్య తెలిపారు. వర్షాకాలంలో ఒక పాఠశాలకు చేరుకోవడానికే 3 కిలోమీటర్లు నడవడం, ప్రాణాలకు తెగించి నదిని దాటాల్సిన పరిస్థితి ఉండటం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Leave a Reply