“ఈ లెక్క వింటేనే కళ్లు తిరుగుతున్నాయి..! లక్ష రూపాయల జీతం వస్తున్నా 20 వేలే మిగులుతోందా..? రూ.25 వేల కారు ఈఎంఐ, రూ.25 వేల ఇంటి అద్దె. నెట్టింట వైరల్‌గా మారిన యువకుడి బడ్జెట్ లెక్క..!!!”

నెలకు రూ. లక్ష జీతం తీసుకునే ఓ 25 ఏళ్ల యువకుడు, తన ఖర్చులన్నీ పోనూ నెలాఖరుకు కేవలం రూ. 20 వేలు మాత్రమే మిగులుతోందంటూ సోషల్ మీడియాలో పంచుకున్న బడ్జెట్ లెక్క నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రెడ్డిట్ (Reddit) ప్లాట్‌‌ఫామ్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్‌పై, మెట్రో నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న జీవన వ్యయం గురించి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. చేతికి ఎంత భారీ జీతం వచ్చినా.. ఖర్చులు పెరిగితే పొదుపు ఎంతలా తగ్గిపోతుందో ఈ లెక్క స్పష్టం చేస్తోంది.

ఆ యువకుడి నెలవారీ ఖర్చుల్లో కారు ఈఎంఐ (EMI) రూ.25 వేలు ఉంది. ఇంటి అద్దెకు మరో రూ.25 వేలు ఖర్చవుతోంది. ఇవి కాకుండా, ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం రూ.6 వేలు చెల్లిస్తున్నట్లు అతను తెలిపాడు. జీతం వచ్చిన కొద్ది రోజులకే ఈ ప్రధాన అవసరాల కోసమే ఏకంగా రూ. 56 వేల వరకు ఖర్చవుతోందని పేర్కొన్నాడు. దీంతో నెల ప్రారంభంలోనే జీతంలో సగానికి పైగా భాగం ఖర్చవుతోంది.

ఆ తర్వాత భోజనం కోసం రూ.10 వేలు, పెట్రోల్ కోసం రూ.5 వేలు, ఇతర బిల్లుల కోసం రూ.3 వేలు ఖర్చవుతున్నాయని ఆ యువకుడు తెలిపాడు. ఇలా ఖర్చులన్నీ పోనూ నెలాఖరుకు తన చేతిలో కేవలం రూ. 20 వేలు మాత్రమే మిగులుతోందని వాపోయాడు. వీటికి తోడు, తన తండ్రి చేసిన రూ.8 లక్షల అప్పును కూడా తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందని.. దీంతో పొదుపు (Savings) పెంచుకోవడం చాలా కష్టంగా మారిందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

ఒకవేళ ఉద్యోగం పోతే, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి తన వద్ద తగినంత పొదుపు లేనందున.. అప్పుడు కారు ఈఎంఐ, ఇంటి అద్దె చెల్లించడం ఎలాగన్న ఆందోళన కూడా తనకు ఉందని ఆ పోస్ట్‌లో తెలిపాడు. ఈ బడ్జెట్ లెక్క చూసిన నెటిజన్లలో కొందరు.. జీతంలో నాలుగో వంతు (25 శాతం) ఖర్చయ్యేంత ఖరీదైన కారు, ఈఎంఐ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం, మెట్రో నగరాల్లో అద్దె, తదితర ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో పొదుపు చేయడం చాలా కష్టంగా మారిందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ యువకుడి పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చే రేపుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *