“ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవం! జెండా ఎగరేయడానికి వెళ్దాం రా…” ఇంటికి వచ్చి పిలిచిన వ్యక్తి! స్నానం చేసి వస్తానన్నా బలవంతంగా తీసుకెళ్లి కాల్చి చంపిన దారుణం!

బీహార్ రాజధాని పాట్నా సమీపంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున 26 ఏళ్ల యువకుడిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

సలీమ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుడిని ఖుస్రూపూర్ ప్రాంతానికి చెందిన వీరూ కుమార్ (26)గా గుర్తించారు. దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలో జరిగిన ఈ ఘాతుకం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. “స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనానికి రమ్మని వీరూ కుమార్‌ను పిలిచేందుకు మొదట ఒక వ్యక్తి ఇంటికి వచ్చాడు. తాను స్నానం చేసి వస్తానని వీరూ చెప్పగా, కాసేపటికే మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి అతడిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు” అని తెలిపారు.

అలా తీసుకెళ్లిన కొద్దిసేపటికే దుండగులు వీరూ కుమార్ తలపై తుపాకీతో గురిచూసి కాల్చి దారుణంగా హతమార్చారు. పాత ఆర్థిక లావాదేవీలు, డబ్బుల వివాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పంచాయతీ సర్పంచ్ (ముఖియా) బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హత్యకు పాల్పడి పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జెండా పండుగకు తీసుకెళ్లి యువకుడిని కిరాతకంగా పొట్టనబెట్టుకున్న ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.


Posted

in

by

Tags: