ఈవీ బైసైకిల్ స్కీమ్: స్కూలుకు వెళ్లే పిల్లలకు మోదీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇస్తుందా? ప్రధానమంత్రి నిజంగానే ఇలాంటి పథకాన్ని ప్రకటించారా?

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం పేదలు, మహిళలు మరియు పిల్లల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో, మోదీ ప్రభుత్వం పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఉచితంగా ‘ఎలక్ట్రిక్ సైకిళ్లు’ ఇస్తోందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే, దీని వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

వైరల్ వీడియో కథాకమీమామి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కూలు పిల్లలకు ఉచితంగా ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇస్తామని ప్రకటిస్తున్నట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త విని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ, ఇటువంటి పథకం గురించి ప్రభుత్వం కానీ, అధికారిక వార్తా సంస్థలు కానీ ఎక్కడా ఎటువంటి ప్రకటన చేయలేదు.

నిజం ఏమిటి?: ఈ వార్త పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పీఐబీ ఫ్యాక్ట్ చెక్’ (PIB Fact Check) వెల్లడించింది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ వైరల్ వీడియోను షేర్ చేస్తూ, అది ‘నకిలీ’ (Fake) అని స్పష్టం చేసింది. ‘GovtEdge’ అనే ఫేస్‌బుక్ పేజీ ద్వారా షేర్ చేసిన ఆ వీడియో పూర్తిగా ఏఐ (AI – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో సృష్టించబడినదని పీఐబీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటువంటి ఎటువంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది.

ప్రజలకు హెచ్చరిక: ఇలాంటి ఆకర్షణీయమైన ఫేక్ వార్తలను నమ్మి మోసపోవద్దని, ఇటువంటి వీడియోలను ఇతరులకు షేర్ చేయవద్దని పీఐబీ ప్రజలను కోరింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సరైన మరియు అధికారిక సమాచారం కోసం కేవలం ప్రభుత్వ వెబ్‌సైట్ https://myscheme.gov.in ను మాత్రమే సందర్శించాలని సూచించింది.


Posted

in

by

Tags: