ఈస్ట్ ఇండియా కంపెనీ మళ్ళీ మూతబడింది; 1857 తర్వాత రెండోసారి కుప్పకూలిన సంస్థ!

ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించి, భారతదేశంలో బ్రిటీష్ వలస పాలనకు బాటలు వేసిన ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ చరిత్ర మళ్ళీ ముగిసింది. లండన్‌లో ఒక లగ్జరీ రిటైల్ సంస్థగా కొనసాగుతున్న ఈ కంపెనీ ప్రస్తుత రూపం ఇప్పుడు దివాళా తీసింది.

ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0: చారిత్రక వారసత్వాన్ని వ్యాపారంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో 2010లో ఈ కంపెనీని పునరుద్ధరించారు. భారతీయ పారిశ్రామికవేత్త సంజీవ్ మెహతా ఈ కంపెనీ హక్కులను కొనుగోలు చేసి, లండన్‌లోని మేఫెయిర్‌లో ఖరీదైన టీ పొడులు, చాక్లెట్లు మరియు ఇతర విలాసవంతమైన వస్తువులను విక్రయించే స్టోర్‌ను ప్రారంభించారు.

ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. “ఒకప్పుడు మనల్ని పాలించిన కంపెనీని ఇప్పుడు ఒక భారతీయుడిగా నేను సొంతం చేసుకోవడం గర్వంగా ఉంది” అని భావోద్వేగంగా పేర్కొన్నారు. కానీ, ఈ రెండో ఇన్నింగ్స్ కూడా ఎంతో కాలం సాగలేదు. అక్టోబరు నెలలో ఈ కంపెనీ లిక్విడేటర్లను నియమించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు మరియు ఉద్యోగుల జీతాలతో కలిపి లక్షల పౌండ్ల అప్పుల్లో ఈ సంస్థ కూరుకుపోయింది. ప్రస్తుతం లండన్‌లోని ఆ స్టోర్ ఖాళీగా ఉంది, వెబ్‌సైట్ కూడా పనిచేయడం లేదు.

తొలి పతనం (1857): ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీనేషనల్ కార్పొరేషన్‌గా పిలవబడే ఈ కంపెనీ, 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత మొదటిసారి రద్దు చేయబడింది. అప్పట్లో అవినీతి ఆరోపణలు, పరిపాలనా వైఫల్యాల వల్ల బ్రిటిష్ క్రౌన్ (బ్రిటిష్ రాణి) ఈ కంపెనీని తన ఆధీనంలోకి తీసుకుని, దాని ప్రైవేట్ సైన్యాన్ని రద్దు చేసింది.


Posted

in

by

Tags: