ఊరిలోకి 3.2 కోట్ల దోమలను వదలనున్న గూగుల్! దీని వెనుక ఉన్న ‘మెగా ప్లాన్’ ఏమిటి? అమెరికా అనుమతిస్తుందా?

వాషింగ్టన్: అమెరికాలో దాదాపు 3.2 కోట్ల దోమలను బహిరంగ ప్రదేశాల్లోకి విడుదల చేయడానికి గూగుల్ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇదేదో టైపింగ్ పొరపాటు అనుకోవద్దు.. ఇది నిజంగా గూగుల్ సిద్ధం చేసిన ఒక వినూత్న ప్రణాళిక. ఇందుకోసం భారీగా ఖర్చు చేయడానికి సిద్ధపడిన గూగుల్, అమెరికా ప్రభుత్వం నుండి అనుమతి కూడా కోరింది. గూగుల్ ఎందుకు ఇలాంటి వింత నిర్ణయం తీసుకుందో ఇప్పుడు చూద్దాం.

ఎందుకు ఈ దోమలు? జికా వైరస్, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు దోమల ద్వారానే వ్యాపిస్తాయి. ఒకరి రక్తాన్ని పీల్చిన దోమ, మరొకరిని కుట్టినప్పుడు ఈ వైరస్‌లను వ్యాపింపజేస్తుంది. దీనివల్ల వ్యాధులు పెరిగి మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి, ఈ వ్యాధిని వ్యాప్తి చేసే దోమల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో, ప్రత్యేకంగా తయారు చేసిన 3.2 కోట్ల (32 మిలియన్లు) దోమలను అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విడుదల చేయడానికి గూగుల్ సిద్ధమైంది.

ఎలా పనిచేస్తుంది? సాధారణంగా దోమలను చంపే పద్ధతులను చూస్తుంటాం. కానీ గూగుల్ ఒక కొత్త పద్ధతిని అనుసరిస్తోంది. ఈ ప్రయోగంలో విడుదల చేసేవి కేవలం ‘మగ దోమలు’ మాత్రమే. ఇవి వ్యాధులను వ్యాప్తి చేయవు. వీటితో కలిసే ఆడ దోమలు పెట్టే గుడ్లు పొదగవు. దీనివల్ల కాలక్రమేణా దోమల సంతతి గణనీయంగా తగ్గి, వ్యాధులు తగ్గుతాయని శాస్త్రవేత్తల అంచనా.

రెండు ఏళ్ల ప్రణాళిక: ఈ ప్రయోగాన్ని ఒకేసారి కాకుండా, రెండు సంవత్సరాల కాలంలో వివిధ దశల్లో అమలు చేస్తారు. తద్వారా శాస్త్రవేత్తలు ఫలితాలను నిరంతరం గమనించి, అవసరమైన మార్పులు చేయడానికి వీలుంటుంది. వ్యాధులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లోనే వీటిని విడుదల చేస్తారు.

అమెరికా అనుమతిస్తుందా? ‘ముల్లును ముల్లుతోనే తీయాలి’ అన్నట్లుగా, దోమలను అంతం చేయడానికి దోమలనే రంగంలోకి దించడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు అనుమతి లభిస్తే, వచ్చే రెండేళ్లు గూగుల్ దీని ప్రభావాలను నిశితంగా పరిశీలిస్తుంది. అయితే, అమెరికా నియంత్రణ సంస్థలు భద్రత, పర్యావరణ ప్రభావం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాయి. మరోవైపు, దోమలను పూర్తిగా నిర్మూలిస్తే పర్యావరణంలో ఇతర సమస్యలు వస్తాయేమోనని సోషల్ మీడియాలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags: