మహారాష్ట్రలోని శంభాజీనగర్ పరిధిలోని తీస్గావ్ గ్రామంలో, 19 ఏళ్ల యువకుడు కుటుంబ కలహాల కారణంగా సమీపంలోని కొండపైకి ఎక్కి కిందకు దూకేస్తానని బెదిరించాడు.
ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు, గ్రామస్తులు కిందికి దిగి రావాలని ఏడుస్తూ వేడుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని రక్షించే ప్రయత్నం చేశారు. సుమారు 3 గంటలకు పైగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, అతడు ఎవరి మాటా వినకుండా కొండ అంచునే నిలబడి ఉన్నాడు.
పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన తండ్రి, కొడుకును సురక్షితంగా కాపాడాలనే ఆందోళనతో కొండపైకి వెళ్లి అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో యువకుడు కిందకు దూకగా, అతడిని పట్టుకునే క్రమంలో తండ్రి కూడా పట్టుతప్పి ఇద్దరూ లోయలో పడి దుర్మరణం చెందారు.
కళ్లెదుటే భర్త, కొడుకు కిందపడి ప్రాణాలు కోల్పోవడం చూసిన తల్లి తీవ్ర దిగ్భ్రాంతికి, పుట్టెడు దుఃఖానికి గురైంది. ఆ తీవ్ర మనస్తాపం భరించలేక, మరుక్షణమే ఆమె కూడా అదే కొండపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply