ఎక్స్‌క్లూజివ్: ఉత్తరాది వంటకాలకు బ్రేక్.. ఇకపై ఇడ్లీ, చపాతీ మాత్రమే! హోటల్ యజమానుల ఆవేదన.. దిక్కుతోచని స్థితిలో కార్మికులు!

ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధం భారతీయ హోటల్ రంగంపై కోలుకోలేని దెబ్బ తీస్తోంది. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉండటంతో, ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో హోటళ్లలో వడ్డించే ఆహార మెనూలో భారీ మార్పులు చేస్తున్నారు. కనీసం కరోనా కష్టకాలంలో కూడా ఇటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోలేదని హోటల్ యజమానులు వాపోతున్నారు.

హార్ముజ్ జలసంధి మూసివేతతో సెగ
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఇంధన రవాణా పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇరాన్ ‘హార్ముజ్’ జలసంధిని మూసివేయడంతో వేలాది బ్యారెళ్ల ముడి చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావంతో గృహేతర (కమర్షియల్) సిలిండర్ల కొరత తీవ్రమైంది. మార్చి 12 నుండి అనేక హోటళ్లు మూతపడే పరిస్థితి నెలకొందని యజమానులు ప్రకటించారు.

మెనూలో మార్పులు.. చైనీస్, నార్త్ ఇండియన్ వంటకాలు బంద్!
సిలిండర్ల విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించడంతో, తమిళనాడులోని పలు హోటళ్లలో ఆహార తయారీ విధానాన్ని మార్చేశారు. ఎక్కువ సేపు పొయ్యి వెలిగించి ఉంచాల్సిన వంటకాలను నిలిపివేస్తున్నారు.

వద్దంటున్న వంటకాలు: చైనీస్ ఫుడ్, నార్త్ ఇండియన్ డిషెస్, ఫాస్ట్ ఫుడ్ మరియు దోశల తయారీని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నారు.

ఏముంటాయి?: తక్కువ గ్యాస్ వినియోగంతో తయారయ్యే ఇడ్లీ, చపాతీ, వెరైటీ రైస్ వంటి వంటకాలను మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నారు.

వేళల్లో మార్పు: ఉదయం 7 నుండి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 2 గంటలు మాత్రమే హోటళ్లు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

లక్షలాది మంది కార్మికులపై ప్రభావం
హోటల్ యజమానుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. “యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు. కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా గ్యాస్ కొరత రాలేదు, కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. దీనివల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లడమే కాకుండా, ఉత్తరాది వంటకాలు చేసే సుమారు లక్ష మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలి” అని కోరారు.

యుద్ధం కారణంగా వంటిళ్లపై పడుతున్న ఈ ప్రభావం సామాన్య ప్రజలను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.


Posted

in

by

Tags: