భార్యాభర్తల బంధమైనా, ప్రేమ వ్యవహారమైనా ఇద్దరి భాగస్వామ్యం చాలా ముఖ్యం. ప్రతిరోజూ ఇద్దరూ సమానంగా ప్రయత్నించాలని నియమం ఏమీ లేదు. కానీ ఎప్పుడూ ఒకరే మాట్లాడటం, ప్రణాళికలు వేయడం, సర్దిచెప్పడం, రాజీపడటం లాంటివి జరిగితే.. ఆ బంధంలో సమతుల్యత లోపించినట్లే. బంధంలో ఒకరి ప్రయత్నమే ఎక్కువగా ఉందో లేదో తెలిపే సంకేతాలు ఇవే:
- ఎప్పుడూ మీరే చొరవ తీసుకోవడం: ముందుగా ఫోన్ చేయడం, మెసేజ్ పంపడం, కలవడానికి ప్లాన్ చేయడం.. ఇలా అన్నీ మీరే చేస్తుంటే అది మొదటి సంకేతం. మీరు ప్రయత్నించడం మానేస్తే ఈ బంధం అక్కడికక్కడే ఆగిపోతుందేమో అన్న భావన మీకు కలుగుతుంటే, దాన్ని కచ్చితంగా ఒక హెచ్చరికగా భావించాలి.
- భావోద్వేగ మద్దతు ఒకరివైపే ఉండటం: మీ భాగస్వామికి సమస్య వస్తే మీరు ఓపికగా విని ఓదారుస్తారు. కానీ, మీకు కష్టం వచ్చినప్పుడు వారి నుంచి అదే స్థాయి మద్దతు దొరకకపోతే.. కాలక్రమేణా అది తీవ్ర నిరాశకు, మానసిక క్షోభకు దారి తీస్తుంది.
- ప్రతిసారీ మీరే రాజీ పడటం: ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేదా అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రతిసారీ మీరే సర్దుకుపోవాల్సి రావడం బంధంలో సమతుల్యత లోపించిదనడానికి మరో నిదర్శనం.
- సంతోషం కంటే అలసటే ఎక్కువగా ఉండటం: ఈ బంధం మీకు ఆనందాన్ని ఇవ్వడం కంటే ఎక్కువగా మానసిక అలసటను మిగిలిస్తుంటే అది ఒక ముఖ్యమైన సంకేతం.
- తప్పు లేకపోయినా మీరే క్షమాపణలు చెప్పడం: సమస్య వస్తే మీరే సరిదిద్దాలి, గొడవైతే మీరే ముందుగా క్షమాపణ అడగాలి, బంధాన్ని కాపాడుకోవడానికి మీరే ఆరాటపడాలి అనే పరిస్థితి ఉంటే.. దీని గురించి భాగస్వామితో బహిరంగంగా మాట్లాడటం చాలా అవసరం.
కొన్ని రోజులు లేదా కష్టకాలంలో బంధంలో ఇలాంటి హెచ్చుతగ్గులు ఉండటం సహజమే. కానీ ఎప్పుడూ ఇదే పరిస్థితి కొనసాగుతుంటే మాత్రం ఇద్దరూ కలిసి మాట్లాడుకుని, మార్పు కోసం ప్రయత్నించడం ఎంతో ముఖ్యం.
