న్యూఢిల్లీ: యాంగూన్ నుండి ఢిల్లీ వస్తున్న ఒక విమానంలో ఇద్దరు విదేశీ ప్రయాణికులపై ఎయిర్ హోస్టెస్కు అనుమానం వచ్చింది. విమానం టేకాఫ్ అయినప్పటి నుండి ఆ ఇద్దరు ప్రయాణికులు కళ్లు మూసుకుని కూర్చున్నారు. కనీసం మంచి నీళ్లు కూడా తాగకపోవడంతో, వారు అనారోగ్యంతో ఉన్నారేమోనని భావించిన ఎయిర్ హోస్టెస్, ప్రేమతో వారి దగ్గరకు వెళ్లి నీళ్లు తాగమని కోరింది. కానీ వారు చాలా వింతగా ప్రవర్తిస్తూ, నీళ్లను తిరస్కరించారు.
అసలేం జరిగింది?
సాధారణంగా అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికులు కనీసం మంచినీళ్లైనా తాగుతారు. కానీ వీరిద్దరూ ఏమీ తినకుండా, తాగకుండా ఉండటం చూసి ఎయిర్ హోస్టెస్ అప్రమత్తమైంది. వెంటనే ఆమె విమాన పైలట్కు సమాచారం అందించింది. పైలట్ ద్వారా ఈ సమాచారం ఢిల్లీ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులకు చేరింది.
విమానం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే, సాధారణ దుస్తుల్లో ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులు ఆ ఇద్దరినీ అనుసరించారు. వారు విమానాశ్రయం వెలుపలికి వెళ్లేముందే కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారిని అదుపులోకి తీసుకుంది.
బంగారు స్మగ్లింగ్ గుట్టు రట్టు:
కస్టమ్స్ అధికారుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి:
స్మగ్లర్లు తమ శరీర భాగాల్లో (ముఖ్యంగా మలద్వారం/Rectum లో) బంగారం లేదా డ్రగ్స్ దాచుకున్నప్పుడు, అవి బయటకు రాకుండా ఉండటానికి ప్రయాణ సమయంలో ఏమీ తినరు, తాగరు.
అనుమానం వచ్చిన అధికారులు ఆ ఇద్దరు ప్రయాణికులకు ఎక్స్రే చేయించగా, వారి మలద్వారంలో బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తేలింది.
వైద్యుల పర్యవేక్షణలో వారి శరీరం నుండి మొత్తం 8 బంగారు బిస్కెట్లను వెలికితీశారు. ఒక్కొక్కరు నాలుగేసి బిస్కెట్లు దాచుకున్నట్లు కస్టమ్స్ అధికారులు ధృవీకరించారు.
