మధ్యప్రాచ్య యుద్ధ జ్వాలలు భారతీయ వంటశాలలను, పారిశ్రామిక చక్రాలను చుట్టుముట్టాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి ఆర్థికంగా సంపన్నమైన రాష్ట్రాల్లో ఎల్‌పిజి కొరత తీవ్రమై జనజీవనం అస్తవ్యస్తమైంది. పరిస్థితులు ఎంతలా దిగజారాయంటే, రైల్వే స్టేషన్లలో మళ్ళీ కరోనా కాలం నాటి లాక్‌డౌన్ దృశ్యాలు కనిపిస్తున్నాయి.
రాజస్థాన్‌లో ఆగిపోయిన పారిశ్రామిక చక్రాలు: అజ్మీర్, జైపూర్, రీంగస్ ప్రాంతాల్లోని టెక్స్టైల్, సెరామిక్, మార్బుల్ మరియు కెమికల్ ఫ్యాక్టరీలు గ్యాస్ కొరతతో మూతపడే దిశగా ఉన్నాయి. వేలమంది కార్మికులు రాత్రికి రాత్రే నిరుద్యోగులయ్యారు. జైపూర్, అజ్మీర్ రైల్వే స్టేషన్లలో తమ ఊర్లకు వెళ్లిపోయే కార్మికులతో కిక్కిరిసిపోతున్నాయి.
ముంబైలో నల్లబజారు మరియు వలసలు: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గ్యాస్ కోసం హాహాకారాలు మిన్నంటుతున్నాయి. ₹900 విలువైన సిలిండర్ బ్లాక్ మార్కెట్‌లో ₹2500 నుండి ₹3000 వరకు పలుకుతోంది. “బయట కొని తినే శక్తి లేదు, గ్యాస్ దొరకడం లేదు.. నగరంలో ఆకలితో చచ్చే కంటే ఊరికి వెళ్లి కట్టెల పొయ్యి మీద వండుకోవడం మేలు” అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్‌లోనూ అదే పరిస్థితి: సూరత్ రైల్వే స్టేషన్‌లో వలస కార్మికులు తమ సామాన్లు, పాత్రలు, స్టవ్ సర్దుకుని రైళ్లు ఎక్కుతున్న దృశ్యాలు భయపెడుతున్నాయి. వంట చేసుకునే వీలు లేనప్పుడు ఇక్కడ పని చేయడం వల్ల ఉపయోగం లేదని వారు వాపోతున్నారు.
ప్రభుత్వ చర్యలు – క్షేత్రస్థాయి వాస్తవాలు: ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లు (14435 వంటివి) జారీ చేసినా, అవి క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని పారిశ్రామిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ‘BW Elm’ మరియు ‘BW Tyr’ అనే రెండు భారీ నౌకలు 94,000 టన్నుల ఎల్‌పిజితో హోర్ముజ్ జలసంధి దాటి భారత్ వైపు వస్తుండటం కొంత ఊరటనిచ్చే అంశం. ఇంధన కొరతను అధిగమించడానికి ప్రభుత్వం పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ అమ్మకాలకు మళ్ళీ పచ్చజెండా ఊపింది.
