సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరలవుతున్న ఒక వీడియో చూస్తుంటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. అదే సమయంలో, ఆ చిన్నారి చూపిన ధైర్యసాహసాలను చూసి ప్రతి ఒక్కరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఒక తెలియని వ్యక్తి, ఒంటరిగా ఉన్న చిన్నారిని కలిసి, “నీకు కొత్త సైకిల్ కొనిస్తాను, చేతిలో రూ. 1,200 ఇస్తాను, నాతో రా” అంటూ ఆశ చూపించి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్లు ఆ చిన్నారి ఆరోపించింది. అయితే, ఆ దుండగుడి మాటలను నమ్మకుండా, ఆ బాలిక వెంటనే అప్రమత్తమై అక్కడి నుండి తప్పించుకుంది. వెంటనే సమీపంలో ఉన్న ప్రజలను పిలిచి సహాయం కోరింది.
ఆ చిన్నారి కేకలు వేయడంతో కంగారుపడిన ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ, నిమిషాల వ్యవధిలో స్థానికులందరూ అక్కడికి చేరుకుని, ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. తెలియని వ్యక్తి ఆశ చూపినప్పుడు ఏమాత్రం భయపడకుండా, సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాపాయం నుండి తప్పించుకున్న ఆ చిన్నారి ధైర్యాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.
