హర్యానా రాష్ట్రంలోని ఓ ఎస్బీఐ (SBI) బ్యాంకు బ్రాంచ్‌లో, సహాయం చేస్తున్నట్లు నటించి ఒక మహిళ వద్ద నుంచి రూ.1.25 లక్షల నగదును ఓ గుర్తుతెలియని వ్యక్తి కాజేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
బాధిత యువతి తన బ్యాంకు ఖాతాలో రూ.1.25 లక్షల నగదును డిపాజిట్ చేయడానికి ఎస్బీఐ బ్యాంకుకు వచ్చింది.
ఆ సమయంలో కౌంటర్ వద్ద నిలబడి ఉన్న ఓ వ్యక్తి, ఆమెకు సహాయం చేస్తానని చెప్పి ఆమె దగ్గర ఉన్న డిపాజిట్ ఫారమ్‌పై తప్పు అకౌంట్ నంబర్ రాశాడు. ఆ తర్వాత అకౌంట్ నంబర్ తప్పుగా ఉందని చెప్పి, మరో కొత్త ఫారమ్ నింపాలని ఆ మహిళకు సూచించాడు.
ఆ మహిళ కొత్త ఫారమ్ నింపుతున్న సమయాన్ని ఆసరాగా తీసుకుని, ఆ వ్యక్తి ఆమె వద్ద ఉన్న నగదును, పాస్‌బుక్‌ను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత పాస్‌బుక్‌ను మాత్రమే ఆ మహిళకు తిరిగి ఇచ్చేసి, రూ.1.25 లక్షల నగదుతో బ్యాంకు నుంచి పరారయ్యాడు.
బ్యాంకులోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, ఆ వ్యక్తి ఎస్బీఐ బ్యాంకు నుంచి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న పీఎన్బీ (PNB) బ్యాంకు వైపు వెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే, ‘బ్యాంకులకు వెళ్లినప్పుడు పరిచయం లేని వ్యక్తులకు మీ ఫారమ్, పాస్‌బుక్ లేదా డబ్బులు ఇవ్వవద్దు’ అని ప్రజలను హెచ్చరించారు.

Leave a Reply