బెంగళూరులోని హెచ్.ఎస్.ఆర్ (HSR) లేఅవుట్లో ఆటో చార్జీ విషయమై ఇద్దరు మహిళలకు, ఆటో డ్రైవర్‌కు మధ్య జరిగిన వాగ్వాదం నడిరోడ్డుపై ఘర్షణగా మారింది.
ఈ ఘటనను అక్కడున్న ఒకరు వీడియో తీయడంతో, ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు మహిళలు, ఆటో డ్రైవర్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న దృశ్యాలు ఈ వీడియోలో రికార్డయ్యాయి. వాగ్వాదం ముదిరిన సమయంలో మరో మహిళ జోక్యం చేసుకుని ఆ గొడవను ఆపడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి, సంబంధిత ఇద్దరు మహిళలను సంప్రదించారు. పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేయాలని వారిని కోరారు. అయితే, ఫిర్యాదు చేయడానికి తమకు ఒకట్రెండు రోజుల సమయం కావాలని ఆ మహిళలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈలోగా పోలీసులు ఆటో డ్రైవర్‌ను కూడా గుర్తించి విచారించారు.
ఆటో డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ఇద్దరు మహిళలు తన ఆటోలో ప్రయాణించారని, చార్జీ విషయంలో వారితో వాగ్వాదం జరిగిందని చెప్పాడు. అంతేకాకుండా, మహిళలు తనను అసభ్య పదజాలంతో దూషించారని, ఆటో చార్జీ ఇవ్వడానికి నిరాకరించారని అతను ఆరోపించాడు. ముందుగా మహిళలే తనపై దాడి చేశారని, ఆ తర్వాతే తాను ఎదురుదాడి చేశానని డ్రైవర్ పేర్కొన్నాడు. మహిళల వైపు నుంచి అధికారిక ఫిర్యాదు అందిన తర్వాత, ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Leave a Reply