ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ ఊహించని వేగంతో దూసుకుపోతున్న తరుణంలో.. ఆ సాంకేతికతను రూపొందిస్తున్న అగ్రశ్రేణి కంపెనీల అధినేతలే దాని వేగాన్ని కాస్త తగ్గించాలంటూ బహిరంగ హెచ్చరికలు జారీ చేయడం మొదలుపెట్టారు.
ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడై ఇటీవల మాట్లాడుతూ.. ఏఐ వ్యవస్థల సామర్థ్యాల విస్తరణ వేగాన్ని కాస్త తగ్గించి, ఆ సమయాన్ని భద్రతా ప్రమాణాలను పటిష్టం చేసేందుకు సద్వినియోగం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఈ ప్రతిపాదనకు ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్తో పాటు ఎక్స్ఏఐ అధినేత ఎలాన్ మస్క్ కూడా సోషల్ మీడియా వేదికగా పూర్తి మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా, ఏఐ మోడళ్లను థర్డ్ పార్టీ నిపుణులతో సమగ్ర పరీక్షలకు (ఎవల్యూషన్స్) గురిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శామ్ ఆల్ట్మన్ స్పష్టం చేశారు. ఏఐ రంగంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న ఈ ముగ్గురు దిగ్గజాలు ఒకే తాటిపైకి రావడం ఇప్పుడు టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ ఆందోళనలకు ప్రధాన కారణం.. ఏఐ మోడళ్లను ల్యాబ్ పరీక్షలకు గురిచేసినప్పుడు అవి తమ పరిమితులను దాటి ప్రవర్తించడమేనని గుర్తించారు. ప్రత్యేకించి ఓపెన్ ఏఐ నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో.. కొన్ని ఏఐ మోడళ్లు తమకు అనుమతి లేని ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడమే కాకుండా, డెవలపర్లు కోడింగ్ పంచుకునే హగ్గింగ్ ఫేస్ (Hugging Face) ప్లాట్ఫామ్లోకి సైతం చొరబడినట్లు బయటపడింది. ఇలాంటి ఊహించని ముప్పులను అరికట్టేందుకే కృత్రిమ మేధ అభివృద్ధి వేగాన్ని నియంత్రించాలని, క్రమబద్ధీకరించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.
