చెన్నై: తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేలో భారీ చీలిక ఏర్పడింది.
ఎన్నికల ఓటమి తర్వాత మొదలైన అసమ్మతి, అసెంబ్లీ పక్ష నేత (CLP Leader) ఎన్నిక విషయంలో తారాస్థాయికి చేరింది. దీంతో పార్టీ రెండు ముక్కలయ్యే పరిస్థితి నెలకొంది. 30 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఎస్.పి. వేలుమణిని ఒక వర్గం తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)ని సమర్థిస్తున్న 17 మంది ఎమ్మెల్యేలు ఆయనే తమ నేత అని వాదిస్తున్నారు. ఇరువర్గాలు తమ వైఖరిని స్పష్టం చేస్తూ స్పీకర్‌కు విడివిడిగా లేఖలు అందజేశాయి. ఈ విషయంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.
జనరల్ సెక్రటరీ పదవి కోల్పోయే ప్రమాదం
పార్టీ చీలిక వైపు వెళ్తుండటంతో, తన జనరల్ సెక్రటరీ పదవిని కాపాడుకోవడానికి ఈపీఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాజీ మార్గంలో భాగంగా సి.వి. షణ్ముగాన్ని శాసనసభాపక్ష నేతగా అంగీకరించేలా చర్చలు జరుగుతున్నాయి. అలాగే గతంలో పార్టీలో ఉన్న కో-ఆర్డినేటర్, జాయింట్ కో-ఆర్డినేటర్ పదవులను మళ్ళీ పునరుద్ధరించి, అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ఈపీఎస్ వర్గం ఎత్తుగడలు వేస్తోంది. పార్టీపై పట్టు కోసం ఇరువర్గాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
స్పీకర్ ఎన్నికలో విజయ్ జాగ్రత్త అడుగులు
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక విషయంలో ముఖ్యమంత్రి విజయ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అధికార పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అభ్యర్థిగా సీనియర్ నేత జె.సి.డి. ప్రభాకర్‌ను ఖరారు చేశారు. చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, తన నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ప్రభాకర్ వంటి వ్యక్తిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం ద్వారా సభను సమర్థవంతంగా నడపవచ్చని టీవీకే భావిస్తోంది. ప్రభాకర్ 1980లో తన 28వ ఏట విల్లివాక్కం నియోజకవర్గం నుండి ఏఐఏడీఎంకే తరపున తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి ఓ. పనీర్ సెల్వంకు అత్యంత సన్నిహితుడైన ఆయన, 2026 జనవరిలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరారు.
